ఆళ్లపల్లి మండలంలో పులి సంచారం ..పాదముద్రలను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు

ఆళ్లపల్లి మండలంలో పులి సంచారం ..పాదముద్రలను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు

ఆళ్లపల్లి వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి గ్రామ పరిధిలోని లక్ష్మీపురం సమీపంలోని పెద్దవెంకటాపురం ప్రధాన రహదారిపై శనివారం పెద్దపులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సెక్షన్ ఆఫీసర్ సురేశ్ అటవీశాఖ సిబ్బందితో గ్రామానికి చేరుకొని పెద్దపులి పాదముద్రలను పరిశీలించారు. అనంతోగు వైపు పెద్దపులి వెళ్లినట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, పశువుల కాపరులు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని చెప్పారు. పులి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.