- నీటి విడుదలకు ప్రయత్నించిన ఇరిగేషన్ అధికారుల అడ్డగింత
- ప్రాజెక్టు కింద ఎండుతున్న పొలాలు
- మంత్రి ఆదేశాలు బేఖాతర్
పెనుబల్లి, వెలుగు: పులిగుండాల ప్రాజెక్టు నీటి విడుదలపై అటవీ శాఖ, గిరిజన రైతుల మధ్య వివాదం ముదురుతోంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కనకగిరి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టు నీరే పెనుబల్లి, కల్లూరు మండలాలకు చెందిన 12 సరిహద్దు గ్రామాల్లోని పంటలకు ఆధారం. 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్102 జారీ చేసి, పులిగుండాలలో ప్రాజెక్టు నిర్మించేందుకు రూ.24 లక్షల మంజూరు చేసింది.
అప్పట్లో ఈ ప్రాజెక్టు ద్వారా 450 ఎకరాల్లో పంటలకు నీరందించాలని భావించి, పనులు ప్రారంభించారు. 1990లో అప్పటి సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జలగం ప్రసాద్ రావు మరో రూ.85.50 లక్షలు కేటాయించగా.. పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు కింద 7 కిలోమీటర్లు పొడవున కాలువలు నిర్మించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో పులిగుండాలలో కోల్పోయిన అటవీ భూమికి బదులు పాల్వంచ డివిజన్ లోని ములకలపల్లి రేంజ్ లో 52 ఎకరాల అసైన్డ్ భూమిని అటవీ శాఖకు బదిలీ చేసింది. పులిగుండాల ప్రాజెక్టు మెయింటెనెన్స్ ను ఇరిగేషన్ శాఖకు అప్పగించింది.
ప్రాజెక్టు వద్ద ట్రెక్కింగ్, బోటింగ్
ఏడాదిగా కనకగిరి అటవీ ప్రాంతంలో పులిగుండాల ప్రాజెక్టు వద్ద అటవీ శాఖ ఎకో టూరిజానికి ప్రాధాన్యం ఇస్తోంది. ట్రెక్కింగ్, బోటింగ్ ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు కింద గిరిజన రైతులు దాదాపు 1,200 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. కానీ, బోటింగ్ పేరుతో అటవీ శాఖ అధికారులు నీటిని వదలకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దన్న మంత్రి
గత నెలలో పులిగుండాల ప్రాజెక్టు నుంచి నీటిని వదలడం లేదని పలువురు రైతులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన రైతులను ఇబ్బంది పెట్టొద్దని, పంటలకు నీరివ్వాలని డీఎఫ్‌వోను ఆదేశించారు. దీంతో 4 రోజులు మాత్రమే నీటిని వదిలి, తర్వాత ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. ఎండలు పెరగడంతో పొలాలు నెర్రెలుబారాయి. ఇరిగేషన్ అధికారులు నీటిని వదిలేందుకు ప్రయత్నించగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు.
ఎకో టూరిజం డెవలప్మెంట్ కు నీరు కావాలని, తాము వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 18 అడుగులు ఉండగా.. బోటింగ్ కు10 అడుగులు సరిపోతుందని ఇరిగేషన్అధికారులు అంటున్నారు. మంత్రి ఆదేశాలను అటవీ శాఖ అధికారులు బేఖాతర్చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి, నీటిని వదిలేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అడిగితే నోటీసులు ఇస్తున్నరుపంటలు ఎండిపోతున్నాయని, పులిగుండాల నీటిని వదలాలని అటవీ శాఖ అధికారులను కోరితే ఒప్పుకోవడం లేదు. ఎకోటూరిజం కోసం నీటిని వదలబోమని చెబుతున్నారు. నీరివ్వాలని అడిగినందుకు మాకే నోటీసులు ఇస్తున్నారు. సమస్యను డీఎఫ్‌వో దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు. - - - రామారావు, డీఈ, ఇరిగేషన్ శాఖ
ప్రాజెక్టులో నీళ్లున్నా వదుల్తలేరు పులిగుండాల ప్రాజెక్టులో నిండా నీళ్లున్నయ్. పొలాలు ఎండుతున్నాయని చెప్తున్నా అటవీ శాఖ అధికారులు వదుల్తలేరు. ఇరిగేషన్ అధికారులను, రైతులను ప్రాజెక్టు దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటున్నరు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మా కోసం ఈ ప్రాజెక్టు కట్టింది. నాకున్న నాలుగెకరాల పొలం ఎండుతంది. మంత్రి చెప్పినా అధికారులు వింటలేరు. - బేతి సలీం, రైతు, బ్రహ్మళ్లకుంట
