
హైదరాబాద్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరుతారన్న ఎపిసోడ్‌కు తెరపడింది. ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు బీజేపీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు కమలం పార్టీ కండువా కప్పి గువ్వలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆదివారం (ఆగస్ట్ 10) గువ్వల జాయింగ్ కార్యక్రమం జరిగింది. గువ్వలతో పాటు అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కాగా, గులాబీ బాస్ కేసీఆర్‌కి సన్నిహితుడిగా పేరున్న గువ్వల బాలరాజు అనూహ్యంగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయ తెలిసిందే. ఈ మేరకు రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపించారు. గతంలో తనపై దాడి జరిగినప్పుడు పార్టీ హైకమాండ్ పట్టించుకోలేదని, పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన గువ్వల ఏ పార్టీలో చేరుతారనే దానిపై స్టేట్ పాలిటిక్స్‌లో వారం రోజులుగా ఉత్కంఠ నెలకొంది. ఆయన బీజేపీలో జాయిన్ అవుతారని ప్రచారం జరిగినా.. ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గువ్వల చెప్పడంతో డైలామా కొనసాగింది. ఎట్టకేలకు గువ్వల ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడింది. మొదటి నుంచి ప్రచారం జరిగినట్లుగానే ఆయన కాషాయ పార్టీలో చేరారు.