మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీ దర్శకుడు చిదంబరం వివాదంలో చిక్కుకున్నాడు. దర్శకుడు చిదంబరంపై కేరళలోని ఎర్నాకులం టౌన్ సౌత్ పోలీసులు సెక్షువల్ హరాస్మెంట్ కేసు నమోదు చేశారు. ఈ కేసు మార్చి 2న ఒక మలయాళ నటీ ఫిర్యాదు మేరకు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఫిర్యాదు చేసిన నటీ వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఈ ఘటన మలయాళ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారగా, ప్రస్తుతం పోలీసులు కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన 2022లో ఎర్నాకులం ప్రాంతంలో ఉన్న ఫిర్యాదుదారి ఫ్లాట్‌లో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. చిదంబరం అక్రమంగా అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి, లైంగిక ఉద్దేశంతో అనుచితంగా ప్రవర్తించాడని ఫిర్యాదుదారు మహిళ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా చిదంబరంపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 74 (మహిళ గౌరవాన్ని అవమానించే ఉద్దేశంతో దాడి లేదా బలప్రయోగం) మరియు సెక్షన్ 75 (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిదంబరాన్ని త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉందని, దర్యాప్తు ఫలితాల ఆధారంగా అరెస్టు సహా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు.
చిదంబరం 2021లో Jan.E.Man సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ చిత్రం మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం చిదంబరం తన మూడో సినిమాగా Balan అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
