వికారాబాద్ లో రాహుల్ గాంధీ టూర్... PAC సమావేశంలో కీలక నేతలతో భేటీ..

వికారాబాద్ లో రాహుల్ గాంధీ టూర్... PAC సమావేశంలో కీలక నేతలతో భేటీ..

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ వికారాబాద్ చేరుకున్నారు. పదిరోజులుగా అనంతగిరిలోని హరిత రిసార్ట్ లో కొనసాగుతున్న తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యేందుకు సోమవారం ( మార్చి 2 ) వికారాబాద్ చేరుకున్నారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో PAC సమావేశంలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. ఈ సమావేశంలో సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, సునీతారావులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

PAC సమావేశంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై రాహుల్ గాంధీ చర్చించినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో పాటు కేసి వేణుగోపాల్ PAC సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత తిరిగి హైదరాబాద్ బయలుదేరారు మంత్రులు. అనంతరం డీసీసీ సమావేశానికి హరిత రిసార్ట్ కు బయలుదేరారు రాహుల్ గాంధీ.  

డీసీసీలకు దిశానిర్దేశం

డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. సంస్థాగత బలోపేతం, రాబోయే ఎన్నికలు వంటి కీలక అంశాలపై డీసీసీ అధ్యక్షులకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై సూచనలు చేయనున్నారు. అనంతరం జడ్చర్లకు చెందిన యూత్ కాంగ్రెస్ నేత నరసింహ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ సమిట్‌‌ను వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేయగా.. అందులో పాల్గొన్న నరసింహ యాదవ్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. పార్టీ కోసం పోరాడి జైలుకెళ్లిన నరసింహ యాదవ్ కుటుంబ సభ్యులను కలిసి పర్యామర్శించనున్నారు. 

మరోవైపు ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యే చాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వారి జీవన స్థితిగతులు, పునరావాసం వంటి అంశాలపై రాహుల్ ఆరా తీసే చాన్స్ ఉన్నట్లు సమాచారం. పర్యటన ముగిసిన తర్వాత రాహుల్ తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.