ఎగబాకుతున్న భారత ఆర్థిక వృద్ధి: 2025-26 జీడీపీ అంచనా 7.6 శాతానికి పెంపు

ఎగబాకుతున్న భారత ఆర్థిక వృద్ధి: 2025-26 జీడీపీ అంచనా 7.6 శాతానికి పెంపు


కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలుశాఖ (ఎంఓఎస్​పీఐ) జీడీపీ లెక్కలను గణించే పద్ధతిని సమూలంగా మార్చింది. ఇంతకుముందు వాడుకలో ఉన్న 2011-–12 పాత ఆధారిత సంవత్సరం (Base Year) స్థానంలో 2022–23ను కొత్త ఆధారిత సంవత్సరంగా ఖరారు చేశారు. జీడీపీ గణన పద్ధతిని సవరించడం ఇది తొమ్మిదోసారి. 

ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాలు (2025-26)
కొత్త సిరీస్ అమలులోకి రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాల్లో మార్పులు సంభవించాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు అంచనాను 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెంచారు. అక్టోబర్ – డిసెంబర్ (మూడో త్రైమాసికం) మధ్య కాలానికి వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. స్థిర ధరల వద్ద వాస్తవ జీడీపీ ప్రస్తుత ఏడాది రూ.322.58 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుత ధరల వద్ద నామమాత్రపు జీడీపీ వృద్ధిరేటు 8.6 శాతంగా ఉంటుందని అంచనా. గత ఏడాది ఇదే సమయానికి ఇది 7.4 శాతంగా ఉన్నది.

2026–27 సంవత్సరానికి మెరుగైన సంకేతాలు
వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27)లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 7 నుంచి 7.4 శాతంగా ఉండవచ్చని ముందుగా భావించగా, ప్రస్తుతం దానిని మరో 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచారు. నామమాత్రపు జీడీపీ వృద్ధిరేటు వచ్చే ఏడాది కాలంలో 11 శాతానికి చేరువయ్యే అవకాశం ఉన్నది. భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.360 లక్షల కోట్లు) మైలురాయిని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు.