
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే సమాచారం ఇచ్చి కలవాలని సూచించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం ప్రజల్లో ఉన్నప్పుడే మంత్రులకు వినతపత్రం ఇవ్వాలన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అనవసరంగా ట్రాప్ లో పడొద్దని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంతో.. కేసీఆర్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇవాళ ఎమ్మెల్యేగాప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ గురించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు.
తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి..బీఆర్ఎస్ పార్టీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు కేసీఆర్. అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందన్నారు.
కాంగ్రెస్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుందని.. ఆ పార్టీ ఇచ్చిన హామీలు చేయలేదన్నారు కేసీఆర్. ప్రభుత్వం ఉంటుందా.? ఉండదా అనేది వాళ్ల చేతుల్లోనే ఉంది.. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిద్దామని సూచించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోరాడుదామన్నారు. అందరితో చర్చించాకే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. వారానికి రెండు రోజుల పాటు పార్టీ కార్యకర్తలను కలుస్తానన్నారు కేసీఆర్.