ఒరేయ్ అంబటి రాయుడు.. నువ్వు పాకిస్తాన్ వెళ్లిపో: చేసిన కామెంట్‎పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

ఒరేయ్ అంబటి రాయుడు.. నువ్వు పాకిస్తాన్ వెళ్లిపో: చేసిన కామెంట్‎పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

హైదరాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‎గా భారత్ ఆపరేషన్ సిందూర్‎తో ప్రతీకారం తీర్చుకోగా.. ఆపరేషన్ సిందూర్‎కు  కౌంటర్‎గా గురువారం (మే 8) రాత్రి భారత్ పై పాక్ దాడులకు పాల్పడింది. పాక్ దాడులను భారత త్రివిధ దళాలు ఎక్కడిక్కడ తిప్పికొట్టాయి. ప్రాణాలు ఫణంగా భారత జవాన్లు వీరోచితంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో భారత జవాన్ల ధీరతవ్వాన్ని యావత్ దేశమే కొనియాడుతోంది. జవాన్ల ధైర్యసాహసాలను పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. 

ALSO READ | ఇండియా-పాకిస్తాన్ యుద్ధం: దేశం కంటే ఏదీ ఎక్కువ కాదంటూ.. మూవీ థియేటర్ రిలీజ్ క్యాన్సల్

ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్ తీవ్ర వివాదస్పదంగా మారింది. పాక్ దాడులకు భారత్ అంతే ధీటుగా సమాధానం ఇస్తోన్న వేళ.. ‘కన్నుకు కన్ను సమాధానం కాదు’ అంటూ రాయుడు చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. 'కన్నుకు కన్ను తీసుకుంటే ప్రపంచమంతా గుడ్డిదవుతుంది' అని రాయుడి చేసిన ట్వీట్‎పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగానే.. ‘‘న్యాయం జరగాలి కానీ మానవత్వాన్ని మరచిపోకూడదు. దేశాన్ని ప్రేమిస్తున్నప్పటికీ గుండెల్లో దయ ఉండాలి’’ అని మరో ట్వీట్ చేసి అగ్నికి ఆజ్యం పోశాడు. రాయుడు ట్వీట్లు చూసి ఆగ్రహంతో రగిలిపోతున్న నెటిజన్లు.. అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్న ఉగ్రవాదులపై జాలి, దయ ఏంటంటూ మండిపడుతున్నారు. 

నరరూప రాక్షసులు ఉగ్రవాదులపై జాలి, దయ చూపిస్తూ.. సైనికుల త్యాగాలను కించపర్చేలా మాట్లాడుతోన్న అంబటి రాయుడిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘ఒరేయ్ అంబటి రాయుడు.. నువ్వు పాకిస్తాన్ వెళ్లిపో’ అని కొందరు.. ‘వీడిని జనసేన నుంచి తరిమేయండి పవన్ కల్యాణ్ గారు’’ అని ఇంకొందరు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఎప్పుడో ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో ఉండటం రాయుడికి అలవాటేనని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. కాగా, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అంబటి రాయుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ప్రస్తుతం రాయుడు కొనసాగుతున్నాడు.