
- రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో పడావు జాగా
- 25 ఎకరాల 19 గుంటలు కొన్న మాజీ సీఎస్
- రూ. 2 లక్షలకు ఎకరా చొప్పున కొన్నట్టు టాక్
- అక్కడ ఎకరం ధర రూ. 3 కోట్ల పైమాటే
- క్విడ్ ప్రోపై అనేక అనుమానాలు!
హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భూముల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో తాను కొనుగోలు చేసిన భూములపై ఇప్పటి వరకు రూ. 14,05,550 రైతుబంధు తీసుకున్నట్టు తెలుస్తోంది. పంటలుసాగు చేసేందుకు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించింది. సోమేష్ కుమార్ ఆ భూమిని సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకున్నారని సమాచారం. రెండు పంటలకు కలిపి సంవత్సరానికి రూ.2,52,750 చొప్పున రైతుబంధు తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఆయన కొనుగోలు చేసిన25 ఎకరాల 19 గుంటలు భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. సాగుకు అనువుగా లేకపోయినా.. రైతుబంధు కింద సాయం పొందినట్లు వెల్లడైంది. ఆయన కొనుగోలు చేసిన భూములతో పాటు ఆ చుట్టుపక్కల సాగుకు అనువు కానీ మెుత్తం 150 ఎకరాలకు రైతుబంధు మంజూరైనట్లు తెలిసింది.
రూ.75 కోట్ల జాగా 50 లక్షలకే!
రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలోని 25 ఎకరాల భూమిని సోమేష్ కుమార్ కొనుగోలు చేశారు. 2018లో నలుగురు దగ్గర నుంచి ఈ భూమిని కొన్నట్టు తెలుస్తోంది. అక్కడ ఒక్కో ఎకరం రూ. 3 కోట్లు పలుకుతుండగా.. ఎకరాకు రూ.2 లక్షలు మాత్రమే చెల్లించి ఖరీదైన భూమిని కారు చౌకకు దక్కించుకున్నట్టు తెలిసింది. ఈ భూమిని అతి తక్కువ ధరకే కొనుగోలు చేయటం వెనుక ఏదో జరిగి ఉంటుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సోమేశ్ కుమార్ తన భార్య జ్ఞానముద్ర పేరు మీద ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే తాను నిబంధనల ప్రకారమే భూమిని కొనుగోలు చేశానని సోమేశ్ కుమార్ చెబుతున్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తనకు అలాట్ చేసిన నివాస స్థలంలో నిర్మించుకున్న ఇంటిని అమ్మేసి ఈ జాగా కొన్నట్టు తెలిపారు. అప్పటి ప్రభుత్వం.. భూమి కొనుగోలుకు అనుమతి కూడా ఇచ్చిందని వివరించారు.