మాజీ డీజీపీ హెచ్‌‌జే దొర కన్నుమూత..ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా విశేష సేవలు

మాజీ డీజీపీ హెచ్‌‌జే దొర కన్నుమూత..ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా విశేష సేవలు
  • కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో డయాలసిస్‌‌
  • నిమ్స్‌‌లో డయాలసిస్‌‌ తర్వాత ఇంటికెళ్లిన దొర
  • బాత్‌‌రూమ్‌‌లో పడిపోవడంతో మళ్లీ నిమ్స్‌‌కు
  • అక్కడ చికిత్స పొందుతూ మృతి
  • నక్సలిజాన్ని అరికట్టేందుకు కృషి 

హైదరాబాద్‌‌, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో డీజీపీగా విశేష సేవలు అందించిన హనుమంతులు జగన్నాధుల దొర (హెచ్‌‌జే దొర) శుక్రవారం కన్నుమూశారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం ఉదయం డయాలసిస్  చేయించుకునేందుకు నిమ్స్‌‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం ప్రమాదవశాత్తు బాత్‌‌రూమ్‌‌లో పడిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు మళ్లీ ఆయన్ను నిమ్స్‌‌కు తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దొర మృతిపై డీజీపీ శివధర్ రెడ్డి సహా పోలీస్‌‌ ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం తెలిపారు. 

1995 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌‌లో చేరి, డీజీపీగా.. 

హెచ్‌‌జే దొర ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 1943లో జన్మించారు. 1965లో ఐపీఎస్‌‌లో  చేరారు. ఐపీఎస్  శిక్షణ పూర్తి చేసుకున్నారు. ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టేందుకు, హింసను తగ్గించేందుకు విశేష కృషి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో దొర చేసిన విశిష్ట సేవలకు 'పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ' అవార్డు లభించింది. అంతర్రాష్ట్ర, ఆర్థిక నేరాలను ఛేదించడంలోనూ తనదైన నైపుణ్యం చూపారు. స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌‌‌‌గా, సీఐడీ చీఫ్‌‌గానూ సేవలందించారు. 1996 నవంబర్‌‌‌‌లో ఏపీ డీజీపీగా నియమితులై.. 2002 ఫిబ్రవరి వరకు ఐదేళ్లకు పైగా పదవిలో కొనసాగారు.

సెంట్రల్  సర్వీసెస్‌‌లో విధులు, మూడు పుస్తకాలు రాసిన దొర

డీజీపీగా పదవీ విరమణ తర్వాత 2002 సెప్టెంబర్ 11న సెంట్రల్  విజిలెన్స్  కమిషన్‌‌లో విజిలెన్స్  కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్  జనరల్‌‌గా పనిచేశారు. ‘ఇంపాక్ట్  ఆఫ్  ట్రైనింగ్  ఆన్  ది పెర్‌‌‌‌ఫార్మెన్స్ ఆఫ్ ఐపీఎస్  ఆఫీసర్స్’, ‘ఎన్టీఆర్‌‌‌‌తో నేను’ పుస్తకాలు రాశారు. వీటితో పాటు ‘జర్నీ త్రూ ట్రబులెంట్ టైమ్స్’ పేరిట తన ఆత్మకథ రాశారు.

డీజీపీగా ఉన్న సమయంలో పోలీసు శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై సమీక్షించేందుకు 'రీట్రీట్' పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ స్ఫూర్తితోనే దాదాపు రెండున్నర దశాబ్దాల విరామం తర్వాత ఈనెల 8, 9న రాష్ట్ర పోలీస్ అకాడమీ 'రీట్రీట్–2026' కార్యక్రమాన్ని నిర్వహించారు.

నక్సలిజంపై పోరు అత్యంత కీలక దశలో ఉన్న సమయంలో పోలీసు బలగాల సామర్థ్యాన్ని పెంచడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారని డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు. మరోవైపు దొర మృతిపై సీఎం రేవంత్​రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి  రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌‌గా, అనంతరం డీజీపీగా ఆయన అందించిన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు.

హెచ్‌‌‌‌జే దొర మృతి తీరని లోటు: కిషన్‌‌‌‌రెడ్డి

ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌‌‌‌జే దొర మృతి తీరనిలోటు అని కేంద్రమంత్రి కిషన్‌‌‌‌రెడ్డి అన్నారు. డీజీపీగా, సీఐఎస్​ఎఫ్​ డైరెక్టర్​గా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. హెచ్‌‌‌‌జే దొర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.