రోజంతా హైడ్రామా..చిదంబరం అరెస్ట్

రోజంతా హైడ్రామా..చిదంబరం అరెస్ట్
  • గోడ దూకి మరీ ఇంట్లో నుంచి తీసుకెళ్లిన సీబీఐ అధికారులు
  • కేంద్ర మాజీ మంత్రి ఇంటి దగ్గర రోజంతా హైడ్రామా
  • ఇవాళ కోర్టులో హాజరుపర్చే అవకాశం
  • బెయిల్ పిటిషన్ను శుక్రవారం విచారిస్తామన్న సుప్రీం
  • ఆ వెంటనే కాంగ్రెస్ ఆఫీసులో ప్రత్యక్షమైన మాజీ మంత్రి
  • తానే తప్పూ చేయలేదని మీడియాకు వివరణ

న్యూఢిల్లీ: ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రస్​ సీనియర్​ నేత పి.చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి భారీ హైడ్రామా నడుమ ఇంటి నుంచి ఆయనను సీబీఐ హెడ్​క్వార్టర్స్​కు తరలించారు. మంగళవారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న చిదంబరం.. బుధవారం సాయత్రం హఠాత్తుగా ఏఐసీసీ ఆఫీసులో ప్రత్యక్షమై మీడియాతో మాట్లాడారు. తానే తప్పూ చేయలేదని, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం ఉందని చెప్పుకున్నారు. చిదంబరం ముందస్తు బెయిల్​ పిటిషన్​ను శుక్రవారం విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఆయన అజ్ఞాతం వీడక తప్పలేదు.

రోజంతా హైడ్రామా..

ఐఎన్​ఎస్​ మీడియాలో అక్రమాలు, మనీలాండరింగ్​కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం..  ముందస్తు బెయిల్‌‌ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌‌ చేస్తూ బుధవారం ఉదయం సుప్రీంకోర్టులో స్పెషల్​ లీవ్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. చిదంబరం తరఫున సీనియర్‌‌ న్యాయవాదులు కపిల్‌‌ సిబల్‌‌, సల్మాన్‌‌ ఖుర్షీద్‌‌, వివేక్‌‌ టంకా వాదనలకు సిద్ధమయ్యారు. ఈ పిటిషన్​ జస్టిస్‌‌ ఎన్‌‌వీ రమణ బెంచ్​ ముందుకు వచ్చింది. అయితే దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్న బెంచ్​.. విచారణ కోసం ఈ పిటిషన్‌‌ను సీజేఐ రంజన్​ గొగోయ్​కి పంపుతున్నట్లు తెలిపింది. పిటిషన్​లో లోపాలున్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గుర్తించడంతో వాటిని సవరించుకుని చిదంబరం తరఫు లాయర్లు లంచ్​ తర్వాత మళ్లీ జస్టిస్​ రమణ బెంచ్​ను ఆశ్రయించారు. లిస్టింగ్​ కాని పిటిషన్​ను తాము విచారించలేమని, దీనిపై ఉదయమే స్పష్టమైన ఉత్తర్వులిచ్చామని బెంచ్​ పేర్కొంది. దీంతో చిదంబరం తరఫు లాయర్లు సీజేఐని కలిసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన అయోధ్య కేసు విచారణలో బిజీగా ఉండటంతో చాలా సేపు ఎదురుచూడాల్సివచ్చింది. సాయంత్రం ఐదు చిదంబరం వ్యవహారంపై సీజేఐ ఆదేశాలిచ్చారు. పిటిషన్​ను వెంటనే విచారించలేమని, శుక్రవారం పరిశీలిస్తామని తెలిపారు. మరోవైపు మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన మాజీ మంత్రిపై ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) లుక్‌‌అవుట్‌‌ నోటీసులు జారీ చేసింది. ముందస్తు బెయిల్​ పొందేందుకు కోర్టులో చేసిన ప్రయత్నాల్నీ ఫెయిల్​ కావడంతో బుధవారం సాయంత్రానికిగానీ చిదంబరం మీడియా ముందుకొచ్చారు.

నేనే తప్పూ చేయలేదు: చిదంబరం

కాంగ్రెస్​ సీనియర్లు కపిల్​ సిబాల్​, అభిషేక్​ సింఘ్వీ, గులాంనబీ ఆజాద్​, అహ్మద్​ పలేట్​, మల్లికార్జున ఖర్గే, సల్మాన్​ ఖుర్షీద్​తో కలిసి మీడియాతో మాట్లాడిన చిదంబరం.. ఐఎన్​ఎక్స్​ మీడియా వ్యవహారంలో తానుగానీ, తన కొడుకుగానీ ఎలాంటి నేరానికి పాల్పడలేదని చెప్పారు.స్వేచ్ఛను పొందడానికి, దాన్ని కాపాడుకోడానికి పోరాటం చేయాల్సిఉంటుందన్నారు. ‘‘గడిచిన 24 గంటల్లో జరిగిన పరిణామాలు చాలా మందిని కన్ఫ్యూజన్​కు గురిచేశాయి. దాన్ని తొలగించడానికే మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో నేను నిందితుణ్ని కాను. మా ఫ్యామిలీ మెంబర్స్​ ఎవరు కూడా నేరానికి పాల్పడలేదు. ఇంతవరకు సీబీఐగానీ, ఈడీగానీ ఎలాంటి చార్జిషీటు దాఖలు చేయలేదు. అలాగే నేను నేరం చేసినట్లు సీబీఐ ఎఫ్​ఐఆర్​లోనూ ప్రస్తావించలేదు. అయినాసరే మేం తప్పు చేసినట్లు కొందరు దురుద్దేశపూర్వకంగా అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారు.  ఇలాంటి అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారు. గతేడాది మే 31, జులై 25న ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆ మేరకు గత 15 నెలలుగా నేను కోర్టు కల్పించిన ప్రొటెక్షన్​లోనే ఉన్నాను. నాకు ముందస్తు బెయిల్​ కొనసాగించే అంశంపై ఈ ఏడాది జనవరి 25న విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్​లో ఉంచారు. మళ్లీ ఏడు నెలల తర్వాత మంగళవారం(ఆగస్టు 20న) బెయిల్​ నిరాకరిస్తూ జడ్జి తీర్పును వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళదామని  లాయర్లైన నా పార్టీ మిత్రులు చెప్పారు. మా పిటిషన్​ను వెంటనే విచారించాల్సిందిగా సుప్రీంకోర్టును మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం దాకా పదే పదే రిక్వెస్ట్​ చేశాం. ఒకవైపు మా లాయర్లు కోర్టులో ప్రయత్నాలు చేస్తుంటే, నాతో పాటు ఇంకొందరు లాయర్లు పిటిషన్​ పేపర్లను ప్రిపేర్​ చేసే పనిలో ఉన్నాం. బుధవారం ఉదయానికిగానీ మా పని పూర్తికాలేదు. రోజంతా ప్రొసీడింగ్స్​ను గమనిస్తూ కూర్చున్నా. అలాంటిది నేను కోర్టుకు భయపడి ఎక్కడికో పారిపోయానని, చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్నానని ఏవేవో ప్రచారం చేశారు. బుధవారం మా పిటిషన్​ లిస్ట్​ కాలేదు. గురువారం కూడా కాదు. శుక్రవారం విచారణ చేపడతామని కోర్టు చెప్పింది’’ అని చిదంబరం చెప్పారు.

కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఇమేజ్​ను దెబ్బతీయడానికే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌‌ నేత రాహుల్​ ఆరోపించారు. సీబీఐ, ఈడీ, కొన్ని మీడియా సంస్థల్ని  వాడుకుంటున్న మోడీ సర్కార్​ తీరును ఖండిస్తున్నానంటూ ట్వీట్​ చేశారు. ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా దీనిపై స్పదించారు. ఏండ్లపాటు దేశానికి సేవ చేసిన వ్యక్తి పట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరించడం అన్యాయమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడేవాళ్లపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని, ఈ వ్యవహారంలో సీబీఐ తీరు అవమానకరంగా ఉందని ప్రియాంక ట్వీట్​ చేశారు.

 

మరిన్ని వార్తలు