SRH vs RR: చిత్తుగా ఓడిన రాజస్థాన్.. ఫైనల్లో స‌న్‌రైజ‌ర్స్

SRH vs RR: చిత్తుగా ఓడిన రాజస్థాన్.. ఫైనల్లో స‌న్‌రైజ‌ర్స్

ఓడిపోయే మ్యాచ్‌లో కమ్మిన్స్ సేన అద్భుతం చేసింది. ప్రత్యర్థి ముందు నిలిపింది సాధారణ లక్ష్యమే అయినప్పటికీ.. వ్యూహాలు రచించి మ్యాచ్ చేజిక్కించుకుంది. తుది జట్టులో ఒక స్పిన్నరూ లేనప్పటికి.. ప్రత్యర్థి ఛేదనకు దిగిన సమయంలో ఏకంగా ముగ్గురు స్పిన్నర్లు బౌలింగ్ చేశారు. ఆ వ్యూహమే ఆరంజ్ ఆర్మీని ఫైనల్‌లో అడుగుపెట్టేలా చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ 175 పరుగులు చేయగా.. ఛేదనలో రాజస్థాన్‌ 139 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా, ఆరంజ్ ఆర్మీ 36 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.

శాంస‌న్‌ వికెట్ టర్నింగ్ పాయింట్

176 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌ 24 పరుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. తడబడుతూ వచ్చిన కాడ్‌మోర్(10)ను క‌మిన్స్ పెవిలియ‌న్ పంపాడు. అనంతరం రాయల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్(10)తో జత కలిసిన య‌శ‌స్వి జైస్వాల్(42; 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్) కాసేపు బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో రాయల్స్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ఆ సమయంలో షాబాజ్ అహ్మద్ బ్రేకిచ్చాడు.  జైస్వాల్‌ (42)ను పెవిలియన్ చేర్చాడు. ఆపై కొద్దిసేపటికే శాంస‌న్‌(10) భారీ షాట్ ఆడి బౌండ‌రీ వ‌ద్ద మ‌ర్క్‌ర‌మ్ చేతికి దొరికాడు. అక్కడినుంచి మ్యాచ్ తలకిందులైంది.

శాంసన్ ఔటయ్యాక రాయల్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది. అశ్విన్‌ (0), హెట్‌మయర్ (4), రోమన్‌ పావెల్ (1) సింగిల్ డిజిట్లకే వెనుదిరిగారు. మరో ఎండ్‌లో ధ్రువ్‌ జురెల్ (56 నాటౌట్; 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు)  అతనికి సహకారం అందించే బ్యాటర్ కరువయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ 2 వికెట్లు తీసుకున్నారు.

ఆదుకున్న క్లాసెన్ 

అంతకుముందు హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్ (50; 34 బంతుల్లో 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. ట్రావిస్ హెడ్ (34), రాహుల్ త్రిపాఠి (37) ఫర్వాలేదనిపించారు. అభిషేక్ శర్మ (12), నితీశ్ రెడ్డి (5), మర్‌క్రమ్ (1), అబ్దుల్ సమద్‌ (0) నిరాశపరచగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌ షాబాజ్ అహ్మద్‌(18) విలువైన పరుగులు చేశాడు. రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.

ఈ విజయంతో ఐపీఎల్‌ పదిహేడో సీజన్‌లో హైదరాబాద్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం(మే 25) టైటిల్‌ పోరులో కోల్‌కతాతో తలపడనుంది.