తాడ్వాయి, వెలుగు: మావోయిస్టు మాజీ అగ్ర నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ 28 ఏండ్ల తరువాత ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని తన సొంతూరు కాల్వపల్లికి వచ్చారు. ఇటీవలే ఆయన తెలంగాణ రాష్ట్ర పోలీసులకు లొంగిపోయారు. సుదీర్ఘ కాలం తరువాత మంగళవారం ఇంటికి చేరుకున్న దామోదర్.. తన తల్లి బతుకమ్మను చూసి భావోద్వేగానికి గురయ్యారు.
‘అవ్వా నేను దామోదర్‌ని.. గుర్తుపట్టినవా?’ అని అడగ్గా, ‘నీ మాట విని గుర్తుపట్టిన బిడ్డ, నువ్వు ఇంటికి రావాలని సమ్మక్క దేవతకు మొక్కిన’ అని తల్లి బదులిచ్చింది. అనంతరం గ్రామస్తులు, స్నేహితులతో కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. దామోదర్ మాట్లాడుతూ.. అజ్ఞాతంలో ఉంటూ ప్రజల కోసం పోరాడానని, ఇకపై ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

