అందుకే కో-ఆర్డినేటర్‌ పదవికి రాజీనామా: బాలినేని భావోద్వేగం

అందుకే కో-ఆర్డినేటర్‌ పదవికి రాజీనామా: బాలినేని భావోద్వేగం

ఒంగోలు : వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తల కోసం ఏదైనా చేస్తానన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాలినేని భావోద్వేగానికి గురయ్యారు. 

‘‘నేను పార్టీకి కట్టుబడి ఉండడాన్ని కొంతమంది అలుసుగా తీసుకున్నారు. అనవసరంగా నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎవరిపైనా సీఎం జగన్​ కు ఫిర్యాదు చేయలేదు. అలాంటి మనస్తత్వం నాది కాదు. నేను టికెట్‌ ఇప్పించిన వారే నాపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు. నాపై ఆరోపణల వెనక ఎవరున్నారో మీరే తెలుసుకోవాలి. ఈ వివాదాలకు అధిష్ఠానమే ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నా. ఒంగోలు నియోజకవర్గంలో నాపై వ్యతిరేకత లేదు. 3 జిల్లాల్లో గడపగడపకు తిరగలేకనే పార్టీ కో-ఆర్డినేటర్‌ పదవికి రాజీనామా చేశా’’ అని బాలినేని చెప్పారు.

ఏప్రిల్​ 29న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. అప్పటి నుంచి బాలినేని హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. మూడు రోజుల క్రితం బాలినేని శ్రీనివాస్‌ రెడ్డిని బుజ్జగించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నించారు. కానీ.. బాలినేని తన అలక వీడలేదు. వైసీపీ రిజనల్ కోఆర్డినేటర్ పదవి తిరిగి చేపట్టేది లేదని తెగేసి చెప్పారు.