రైతుల కోసం పోతే అరెస్ట్ చేస్తరా?: హరీశ్ రావు

రైతుల కోసం పోతే  అరెస్ట్ చేస్తరా?: హరీశ్ రావు
  • పంట భూములను పరిశ్రమల కోసం లాక్కోవడం అన్యాయం: హరీశ్​రావు
  • భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్​ను వాపస్​ తీసుకునేదాకా పోరాడుతం
  • పరిగిలో భూముల పరిశీలనకు వెళ్లేందుకు హరీశ్​ సహా బీఆర్ఎస్​ నేతల యత్నం
  • తొలుత గృహ నిర్బంధం.. ఆ తర్వాత అప్పా జంక్షన్​ వద్ద అరెస్ట్​

హైదరాబాద్, వెలుగు: రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్​ హరీశ్ రావు విమర్శించారు. నాడు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యమన్నారని, ఇప్పుడేమో ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను కలిసేందుకు వెళ్తుంటే అరెస్ట్​ చేయడం దౌర్జన్యమని ఫైర్​ అయ్యారు. ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన అని విమర్శించారు. రెండు మూడు పంటలు పండే భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమన్నారు. మంగళవారం పరిగిలో భూముల పరిశీలనకు వెళ్లాలనుకున్న హరీశ్​ రావును తొలుత హౌస్​ అరెస్ట్​ చేశారు. దీంతో బీఆర్​ఎస్​ నేతలు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు హరీశ్​ను విడుదల చేయగా.. పరిగి బయల్దేరారు. మార్గమధ్యలో అప్పా జంక్షన్​ వద్ద పోలీసులు హరీశ్​ రావు వాహనాలను అడ్డుకున్నారు. హరీశ్​తో పాటు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావును అరెస్ట్​ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బీఆర్​ఎస్​ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆందోళనల మధ్యనే పోలీసులు హరీశ్, సబిత, ఎర్రబెల్లిని శంషాబాద్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా హరీశ్​ రావు మాట్లాడారు. రాముడు, రాక్షసుడు అని రేవంత్ అంటున్నారని.. రేవంత్​ను మించిన రావణాసురుడు ఇంకెవరూ లేరని హరీశ్​ మండిపడ్డారు. రేవంత్​ మళ్లీ గెలుస్తాడన్నది పగటి కల అని, వచ్చేది రామరాజ్యం..కేసీఆర్​ రాజ్యమని పేర్కొన్నారు.   

ఎందుకంత భయం.. 

భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని, అప్పటి దాకా తమ పోరాటం ఆగదని హరీశ్​తేల్చి చెప్పారు. రైతుల పక్షాన పోరాడుతుంటే.. ప్రభుత్వానికి ఎందుకంత భయమని ఆయన ప్రశ్నించారు. రైతుల గోస వినడానికి కళ్లాపూర్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నామని.. కానీ, పోలీసులు వెళ్లి టెంట్లు చింపి, రైతులను, మహిళలను అరెస్టు చేశారని అన్నారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడమేనా ప్రజాపాలన అంటే? అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల భూముల మీద రేవంత్​ రెడ్డి దండ యాత్ర చేస్తున్నారన్నారు. రేవంత్​ వచ్చిన రెండున్నరేండ్లలో 10 వేల ఎకరాల దళితుల, ఎస్టీల భూములు లాక్కున్నారన్నారు. పరిశ్రమలు పెడతామని నోటిఫికేషన్లు ఇచ్చి ఇంకో 40 వేల ఎకరాల భూములు లాక్కునే కుట్రలకు 
తెరలేపారన్నారు. 

ప్రభుత్వానిది పిరికిపంద చర్య: కేటీఆర్​

రైతుల పక్షాన నిలబడేందుకు వెళ్తున్న హరీశ్​రావు, సబితా ఇంద్రారెడ్డితోపాటు బీఆర్ఎస్​ నేతలను అరెస్ట్​ చేయడం కాంగ్రెస్​ ప్రభుత్వ పిరికిపంద చర్య అని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ప్రశ్నించే గొంతులను పోలీసు బలంతో నొక్కడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్​ ప్రభుత్వం.. హామీలను గాలికొదిలి పేదల భూములపై పడిందన్నారు. పరిశ్రమల పేరుతో భూ సేకరణకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు. రెండున్నరేండ్లలో ఒక్క పరిశ్రమనూ తీసుకురాని సర్కార్​.. భూములను దోచుకోవడంలో మాత్రం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నదన్నారు. ప్రభుత్వం ఎంత అణచివేతకు పాల్పడినా బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.