ప్రజల కోసం పోరాడేది ఒక్క బీఆర్‌ఎస్ మాత్రమే: హరీష్ రావు

ప్రజల కోసం పోరాడేది ఒక్క బీఆర్‌ఎస్ మాత్రమే: హరీష్ రావు

మెదక్: ప్రజల కోసం పోరాడేది ఒక్క బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని.. ఈ విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం (ఏప్రిల్ 5) జహీరాబాద్ నియోజకవర్గ బీజేపీ కీలక నేతలు హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని.. 8 మంది ఎంపీలను గెలిపించినా బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు.

ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీను తుక్కు కింద అమ్ముతున్నారని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల బీజేపీ చిన్న చూపు చూస్తోందని..  ముఖ్యంగా తెలంగాణాకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఫైర్ అయ్యారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని.. అలాగే సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు.

ఎస్డీఎఫ్, టీపీఐడీసీ నిధులను విడుదల చేయకుండా జిల్లా అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తయితే జిల్లా మొత్తం సాగు నీటితో సస్య శ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బసవేశ్వర ప్రాజెక్టుపై త్వరలోనే బీఆర్ఎస్ తరపున కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.