
కృష్ణా : వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో కీలక విషయాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య జరిగిందని తెలిపారు. ఆ వివరాలను మీడియాకి వెల్లడిస్తూ… రాజకీయపరమైన, కులపరమైన అధిపత్యపోరులో భాగంగానే పక్కా పథకంతో భాస్కరరావును హతమార్చారని ఎస్పీ చెప్పారు. “నేనున్నా.. ఏం జరిగినా నేను చూసుకుంటా.. నా పేరు రాకుండా హతమర్చమని” కొల్లు రవీంద్ర ముద్దాయిలను ప్రోత్సహించాడని, రవీంద్ర ప్రోత్సాహంతోనే ముద్దాయిలు భాస్కరరావును హత్య చేశారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికి ఆరుగురిని అరెస్ట్ చేశామని, వారిలో కొల్లు రవీంద్రతో పాటు, మరొ మైనర్ బాలుడు కూడా ఉన్నారని తెలిపారు.
హత్య జరగక ముందు కూడా నిందితులు రవీంద్ర పీఎ ద్వారా అతనితో మాట్లాడారని ఎస్పీ తెలిపారు. “అత్యవసరమైతే నాకు ఫోన్ చేయకండి, నా పీఎలలోలఎవరికైనా ఒకరికి ఫోన్ చేయండి” అని రవీంద్ర ముద్దాయిలతో మాట్లాడారని, హత్య జరిగిన పది నిమిషాల తర్వాత నిందితుల్లో ఒకరైన నాంచారయ్య పీఎకు ఫోన్ చేసి.. “పనైపోయిందని చెప్పగా… జాగ్రత్తగా ఉండమని” రవీంద్ర వారికి చెప్పినట్టు ఎస్పీ రవీంద్రనాధ్ బాబు తెలిపారు.
అన్ని రకాలుగా ఈ హత్య కేసులో రవీంద్ర ప్రమేయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఆయనకు విచారణ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వారి ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు. అప్పటికే రవీంద్ర పరారవటంతో గాలింపు కోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించామని, చిలకలపూడి సీఐ వెంకట నారాయణ నేతృత్వంలోని బృందం రవీంద్రను తుని వద్ద అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. విచారణ జరిపి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని చెప్పారు.