కారు సర్వీసింగ్కు పోయింది.. 100 స్పీడ్తో దూసుకొస్తది: కేటీఆర్

కారు సర్వీసింగ్కు పోయింది..  100 స్పీడ్తో దూసుకొస్తది: కేటీఆర్

కారు సర్వీసింగ్ కు పోయిందని.. మళ్లీ వంద స్పీడుతో  దూసుకొస్తామన్నారు మాజీ మంత్రి కేటీఆర్.  చేవెళ్ల సభలో మాట్లాడిన కేటీఆర్...బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రశ్నిస్తాం..పోరాడతామని చెప్పారు.  గత పదేళ్లతో పార్టీ నేతలు, కార్యకర్తలకు మధ్య సమన్వయం లోపించిందని..ఇక ముందు అలా జరగకుండా చూస్తామని చెప్పారు. 14 స్థానాలు  ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయామని..అందులో సగం గెలిచినా హంగ్ వచ్చేదన్నారు. 

కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంతో ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు 420 హామీలను నెరవేర్చలేక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చేవేళ్ల చౌరస్తాలో నిలబెడతామన్నారు. లంకె బిందెలున్నాయని వస్తే ఖాళి బిందెలున్నాయంటున్న సీఎం రేవంత్ మాటలు విడ్డూరమన్నారు.   కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తిని సీఎం చేస్తే ఇలానే ఉంటదని ఎద్దేవా చేశారు.  50 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది..రానున్న రోజుల్లో ఇంకా చాలా చూస్తామన్నారు. 

కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదన్న కేసీఆర్ మాటలను రేవంత్ నిజం చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్.  మార్పు కావాలి అన్నోళ్లు..ఇపుడు నెత్తినోరు కొట్టుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు.. రెండు లక్షల రుణమాఫీ,లక్షరూపాయల తులం బంగారం ఎక్కడా అని ప్రశ్నించారు.