కామారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చింది , రైతులకు అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు ఆ పార్టీ నాయకుడు , మాజీ మంత్రి షబ్బీర్ అలీ. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎల్ఐసి, రైల్వే లాంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని, లాభాల్లో ఉన్న అనేక కంపెనీలను అధాని, అంబానీ లాంటి 14 కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తున్నారని అన్నారు.
రైతుల విషయంలో టీఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతోందని, రైతుల కోసం నాడు కాంగ్రెస్ ధర్నా చేస్తే తమ నాయకులపై కేసులు పెట్టారన్నారు. ఇటీవల జరిగిన రెండు మూడు ఎన్నికలు కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా చేసాయని.. అందుకే ఏ ప్రశ్నించే తత్వం వద్దన్నారో, ఏ ధర్నా చౌక్ లు ఎత్తేసారో, ఏ రాస్తారోకలు లేకుండా చేశారో ఇప్పుడు అదే విధానాన్ని టిఆర్ఎస్ తీసుకుందన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకపోవడానికి మూడు కారణాలున్నాయన్న షబ్బీర్ అలీ.. కల్వకుంట్ల కుటుంబంపై ఆవేశంతో ఉన్న ప్రజలు ఆ పార్టీని ఓడించాలని చూశారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నాయకులను కోట్ల రూపాయలతో కేసీఆర్ కొనుగోలు చేయడంతో.. కాంగ్రెస్ టికెట్ పై గెలిచినా టిఆర్ఎస్ లోకి చేరుతారన్న ఆలోచన ప్రజల్లోకి వచ్చేలా చేశారన్నారు. ఓట్లకోసం టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలూ నోట్ల కట్టలు వెదజల్లారని, లిక్కర్ ఏరులై పారిందని.. అందుకే కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయిందన్నారు
