
- : నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ ఓ నాన్సెన్స్ కేసు అని బీఆర్‌ఎస్‌నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యవస్థలో భాగంగా జరిగే వ్యవహారమని చెప్పారు. టెలీగ్రాఫ్ చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకుని, ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చునన్నారు. గతంలో కేసీఆర్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాలను తెరమీదకు తెస్తున్నదని విమర్శించారు. ఈ అంశంలో ప్రభుత్వమే లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే లీగల్‌గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఇన్నాళ్లు సిల్లీ ఇష్యూగా పరిగణించి పక్కన బెట్టామన్నారు. కానీ, లీకు వార్తలు ఇలాగే కొనసాగితే లీగల్‌గా ముందుకెళ్తామన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్‌ను ట్యాప్ చేశారని, ఆ విషయం తమకు తెలిసినా దాన్ని పట్టించుకోలేదన్నారు.
ఇందిర హయాంలో..
ఇందిర హయాంలో సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేయించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిఆరోపించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఫోన్ ట్యాప్ అయినట్టు చెప్పారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌కు లైడిటెక్టర్ టెస్ట్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌కు లైడిటెక్టర్ టెస్ట్ చేస్తే, ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర బయటపడుతుందన్నారు.