20 నిమిషాల్లో 30 వేల టికెట్స్ ఎలా అమ్ముడైనై!

20 నిమిషాల్లో 30 వేల టికెట్స్ ఎలా అమ్ముడైనై!

క్రికెట్ టికెట్ల అమ్మకాల్లో భారీగా అవినీతి జరిగిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పేటీఎంకు కాంట్రాక్టు ఇవ్వడంలోనే     అవకతవకలు జరిగాయని తెలిపారు. 20 నిమిషాల్లోనే 30 వేలకు  పైగా టిక్కెట్లు ఎలా అమ్ముడు పోతాయని ప్రశ్నించారు. మంత్రి  కేటీఆర్ ఆదేశాలతోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రికెట్ టికెట్ల విషయంలో ఎంటర్ అయ్యారని చెప్పారు. అందరూ కలిసి టికెట్లను బ్లాక్ లో అమ్మేసి భారీగా సొమ్ము చేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కాళేశ్వర ప్రాజెక్ట్, ఫినిక్స్, లిక్కర్ స్కాంలు సరిపోదన్నట్టు.. ఇప్పుడు క్రికెట్ టికెట్ల కుంభకోణానికి తెరదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సొమ్మును దోచుకునేందుకు ఇంకా ఎన్ని కుంభకోణాలు చేస్తారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిలదీశారు. 

క్రికెట్ టికెట్ల అమ్మకాల్లో ప్రభుత్వంకు ఏమి సంబంధం ఉందో సమాధానం చెప్పాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ  అని..BCCI ఆదేశాలతో నే HCA టికెట్లు విక్రయిస్తుందన్నారు. ఆదివారం నగరంలో జరిగే ఇండియా–ఆస్ట్రేలియా  మూడో టీ20 మ్యాచ్‌‌‌‌ టిక్కెట్ల కోసం ఫ్యాన్స్‌‌‌‌ గత నాలుగు రోజులుగా ఉప్పల్‌‌‌‌, జింఖానా గ్రౌండ్‌‌‌‌చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు జోరందుకున్నాయి. స్టేడియం బయట మూడు రంగులతో పెయింట్స్ వేస్తున్నారు. రోడ్డు మార్గంలో ఉన్న చెట్లకు కూడా మూడు రంగులు వేశారు. ఇక స్టేడియం దగ్గర టికెట్స్ ఇస్తారేమో అన్న ఆశతో అప్పుడుప్పుడు అభిమానులు వచ్చిపోతున్నారు. ఇప్పటికే టికెట్స్ ఇష్యూ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న HCA.. మ్యాచ్ నిర్వహణ లో ఎలాంటి లోపాలు జరగకుండా ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.