- ఇతర నిందితులకూ విముక్తి
- విచారణ కోసం ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లు రద్దు
- 14 ఏండ్ల తర్వాత వెలువడిన తీర్పు
న్యూఢిలీ: బొగ్గు బ్లాక్ కేటాయింపులకు సంబంధించి న ఆరోపణల్లో 20 ఏండ్ల తర్వాత మాజీ ప్రధాని, దివంగత నేత మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనపై 2012లో నమోదైన క్రిమినల్ కేసును బుధవారం కొట్టివేసింది. విచారణకు హాజరు కావాల్సిందేనని గతంలో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను కూడా రద్దు చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనతో కూడిన బెంచ్ బుధవారం తుది తీర్పు వెలువరించింది. సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును ఆమోదిస్తూ, మన్మోహన్‌తోపాటు ఇతరులకు కూడా కేసు నుంచి విముక్తి కల్పించింది.
కేసు ఏంటంటే..
2005లో ఒడిశాలోని తలబిరా-2 బొగ్గు బ్లాక్ కేటాయింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, ప్రైవేట్ కంపెనీ (హిందాల్కో) ప్రతిపాదనల ఆధారంగా రూల్స్ మార్చారని ఆరోపణలు వినిపించాయి. పారదర్శకమైన వేలం పాట నిర్వహించకుండా, ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చారని ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పట్లో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్.. బొగ్గు గనుల శాఖను కూడా స్వయంగా పర్యవేక్షించారు. దీంతో ఈ వివాదం రాజకీయంగా పెను దుమారం రేపింది.
బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశాయి. మన్మోహన్ సింగ్‌పై తీవ్రస్థాయిలో బురదజల్లాయి. దీంతో ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టింది. ప్రధాని మన్మోహన్ సింగ్, హిందాల్కో ఇండస్ట్రీస్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరాఖ్‌తో పాటు మరో ముగ్గురిపై 2012లో కేసు నమోదు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం బొగ్గు బ్లాక్ ల కేటాయింపుల్లో ఎలాంటి అవినీతి గానీ, దురుద్దేశపూర్వక కుట్ర గానీ జరగలేదని తేల్చి, కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది.
అయితే, ఈ రిపోర్టును 2015లో ట్రయల్ కోర్టు.. సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును తోసిపుచ్చింది. మన్మోహన్ సింగ్‌పై క్రిమినల్ కుట్ర, నమ్మకద్రోహం వంటి అభియోగాల కింద 2015 మార్చి 11న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
సుప్రీంను ఆశ్రయించిన మాజీ ప్రధాని
ట్రయల్ కోర్టు ఉత్తర్వులను మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. మాజీ ప్రధానిపై క్రిమినల్ కేసు పెట్టి విచారణ జరపాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరని వాదించారు. బొగ్గు బ్లాక్ కేటాయింపులో తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని చెప్పారు. దీంతో ట్రయల్‌కోర్టు జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
తాజాగా సీబీఐ దాఖలు చేసిన 2 క్లోజర్ రిపోర్టులను పరిశీలించాక.. ఈ కేసులో విచారణ చేపట్టడానికి తగిన ఆధారాలులేవని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ విచారణకు హాజరుకావాలంటూ జారీ చేసిన సమన్లను కూడా రద్దు చేస్తూ కేసును క్లోజ్ చేసింది.
