ఓయూ ఆర్ట్స్​కాలేజీ మాజీ ప్రిన్సిపాల్  ప్రొ.మోహన్​సింగ్ మృతి

ఓయూ ఆర్ట్స్​కాలేజీ మాజీ ప్రిన్సిపాల్  ప్రొ.మోహన్​సింగ్ మృతి

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, ఆర్ట్స్​కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మోహన్ సింగ్(82) కన్నుమూశారు. సోమవారం నాగోలులోని తన ఇంట్లో గుండెపోటుతో మృతి చెందారు. మోహన్ సింగ్ ఆర్ట్స్ కాలేజీకి పదేళ్లపాటు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. అలాగే వర్సిటీ చీఫ్ వార్డెన్ గా, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ గా కూడా సేవలందించారు. నాగర్ కర్నూల్​ జిల్లా వెల్దండ గ్రామానికి చెందిన మోహన్ సింగ్ ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగారు. ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి రెండు దశాబ్దాలపాటు హిందీ భాషాభివృద్ధికి కృషి చేశారు.

పీహెచ్ డీ స్కాలర్లకు మార్గదర్శనం చేసి వారిని తీర్చిదిద్దారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, అప్పటి నేషనల్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నందమూరి తారక రామారావుకు హిందీ భాష సలహాదారుడిగా, అనువాదకుడిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై అప్పటి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పార్లమెంటులో సమర్పించిన నివేదికను మోహన్ సింగ్ స్వయంగా రాసి ఇచ్చారు. మోహన్ సింగ్ హిందీలో ‘తెలంగాణకి పుకార్’ అనే పుస్తకాన్ని రచించగా ఉద్యమకారులతో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. మోహన్ సింగ్ మృతి పట్ల ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, స్టూడెంట్లు సంతాపం వ్యక్తం చేశారు.