వీడియో తీసుకుని లెటర్​ రాసి ..  మాజీ సర్పంచ్ ​మిస్సింగ్

వీడియో తీసుకుని లెటర్​ రాసి ..  మాజీ సర్పంచ్ ​మిస్సింగ్

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా సింగరాయిపల్లి మాజీ సర్పంచ్​అధికం సత్యాగౌడ్​ఆదివారం ఓ వీడియో పెట్టి, లెటర్ ​రాసి అదృశ్యమయ్యారు. గ్రామంలో తాను చేపట్టిన సీసీ రోడ్డు కాంట్రాక్ట్ పనికి బిల్లు రాకుండా కొందరు అడ్డుతగులుతున్నారని, తన చావుకు వాళ్లే కారణమని అందులో పేర్కొన్నాడు. దీనిపై సత్యాగౌడ్ ​భార్య లింగామణి సోమవారం కామారెడ్డి టౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాల్వంచ మండలం సింగరాయిపల్లికి చెందిన మాజీ సర్పంచ్​సత్యాగౌడ్ ​కొద్ది రోజులుగా కామారెడ్డి టౌన్​లోని రాజీవ్ నగర్​లో ఉంటున్నాడు. సెల్పీ వీడియోతో పాటు, లెటర్​లో వివరాల ప్రకారం.. సత్యాగౌడ్​ ఊరిలో 15 నెలల కింద రూ.7.50 లక్షల సీసీ రోడ్డు పని చేశాడు.

ALSO READ :ఫుడ్​ పాయిజన్.. 40 మంది స్టూడెంట్లకు అస్వస్థత

ఈ బిల్లు ఇంకా రాలేదు. సింగరాయిపల్లి ప్రస్తుత సర్పంచ్​మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్​ ఈ ఏడాది మే 22న ఇంట్లో నుంచి బయటకెళ్లి, 23న శవమై కనిపించాడు. ఇతడి ఆత్మహత్యకు కారణమంటూ పోలీసులు ముగ్గురిని అరెస్ట్​ చేయగా, అందులో సత్యాగౌడ్ ​కూడా ఉన్నాడు. కొద్ది రోజుల కింద  బెయిల్​పై బయటకు వచ్చాడు. తనకు రావాల్సిన బిల్లు గురించి ఆఫీసర్లను సంప్రదించాడు. తనకు చెక్​ఇవ్వలేదని, సీసీ రోడ్డు పని చేసేందుకు అప్పులపాలైనట్లు వీడియో లో  పేర్కొన్నాడు. అధికం రాజేందర్​గౌడ్, తోట భూమయ్య, ఇసాయిపేట సర్పంచి బాలాగౌడ్​కలిసి ఎమ్మెల్యేకు చెప్పి, సర్పంచ్​కొడుక్కి చెక్​ఇప్పించారని అందులో చెప్పాడు. తన చావుకు భూమయ్య, రాజేందర్​, బాలాగౌడ్, గొల్ల అంజయ్య కారకులని చెప్పాడు. ఎంపీవో, సెక్రెటరీ, డీఎల్​పీవో వారికి సహకరించారని లెటర్​లో రాశాడు.