అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచ్ ల యత్నం

అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచ్ ల యత్నం

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: సర్పంచుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచుల జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ర్యాలీగా వచ్చిన మాజీ సర్పంచులను నాంపల్లి గాంధీభవన్ వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. సొంత డబ్బులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచులకు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామపంచాయతీలకు వచ్చే నిధుల ద్వారా మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించేలా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2019 నుంచి 2024 వరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినప్పటికీ బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. బిల్లులు రాకపోవడంతో పలువురు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.