కులం కన్న గుణమే మిన్న : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

కులం కన్న గుణమే మిన్న : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు 
  • అమ్మను పరభాషలో పిలిస్తే శవంతో సమానం
  • పోఖ్రాన్‌‌ అణు పరీక్షల ధీశాలి వాజ్‌‌పేయి : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

ఖమ్మం, వెలుగు : ‘మాజీ ప్రధాని అటల్‌‌ బిహారీ వాజ్‌‌పేయి కేవలం ఓ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ప్రపంచ దేశాల ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా రాజీలేని ధోరణితో పోఖ్రాన్‌‌ అణు పరీక్షలు నిర్వహించిన ధీశాలి’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన వాజ్‌‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ‘అటల్​జీకి అక్షర నీరాజనం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పదవులు, పీఠాల కోసం వాజ్‌‌పేయి ఎప్పుడూ రాజీపడలేదన్నారు.

వాజ్‌‌పేయి హయాంలోనే దేశవ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి రహదారులు నిర్మాణం అయ్యాయని, గ్రామీణ రహదారుల అనుసంధానం, సమాచార ప్రసార రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. గతంలో జనసంఘ్, కమ్యూనిస్ట్, కాంగ్రెస్‌‌ వంటి రాజకీయ పార్టీలకు ఒక నిర్దిష్టమైన సిద్ధాంతం ఉండేదని, నేటి రాజకీయాల్లో ఆ సిద్ధాంతాలు పూర్తిగా లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులం కన్నా గుణమే మిన్న అని తెలుసుకోవాలని, కులం, ధనం, మతం, నేరచరిత్ర ఆధారంగా కాకుండా నాయకుడి వ్యక్తిత్వం, సామర్థ్యం, యోగ్యత, ప్రవర్తన చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుత మీడియా సంస్థలు వివాదాలకు ఇస్తున్న ప్రాధాన్యం.. సమాజానికి మేలు చేసే అంశాలకు ఇవ్వడం లేదన్నారు. రాజకీయాల్లో భాష మారాలని, కొందరు వ్యక్తులు రాజకీయాలు అంటేనే అసహ్యం కలిగేలా మాట్లాడుతున్నారన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలు తప్పనిసరిగా మాతృభాషలోనే మాట్లాడాలని పిలుపునిచ్చారు. ‘అమ్మ’ అనే తెలుగు పదానికి బదులుగా ఆంగ్ల పదం వాడితే శవం అనే అర్థం వస్తుందన్నారు. ఇతర భాషలు నేర్చుకున్నప్పటికీ.. ప్రాధాన్యం మాత్రం మాతృభాషకే ఇవ్వాలన్నారు.

‘హిందుత్వం అంటే మతం కాదు.. ఎవరినీ ద్వేషించని ఒక గొప్ప జీవన విధానం, అత్యంత విశాలమైన సంస్కృతి’ అని వివరించారు. కార్యక్రమంలో వాజ్‌‌పేయి శతజయంతి ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు దుద్దుకూరి వెంకటేశ్వరరావు, మందడపు ప్రభాకర్‌‌రెడ్డి, మాజీ మంత్రి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బీజేపీ ట్రెజరర్‌‌ దేవకి వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు పాల్గొన్నారు.

వాజ్‌‌పేయిని ఆదర్శంగా తీసుకోవాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

అన్ని రాజకీయ పక్షాలు వాజ్‌‌పేయిని ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచించారు. వాజ్‌‌పేయి మాటలు, ప్రసంగాల స్ఫూర్తితో ఎంతో మంది యువత రాజకీయాల్లోకి, సాహిత్యంలోకి వచ్చారన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆరోగ్యకరమైన విమర్శలకు బదులు బూతులు మాట్లాడుతున్నారన్నారు.