గొర్రెల పంపిణీ పథకంపై NCDCకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

గొర్రెల పంపిణీ పథకంపై NCDCకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

గొర్రెల పంపిణీ పథకంపై నేషనల్ కోపఆరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (NCDC)కి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపకం స్కీమ్ పై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని , అందుకోసం ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని NCDC ఎండీకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ఆ స్కీమ్ వర్కౌట్ అవుతుందా ? స్కీంలో లోటు పాట్లు ఏమిటి ? అనేది పరిశీలించాలని జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ ను కోరారు.  

మొదటి విడత గొర్రెల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుతో ఇప్పటికే రూ.4వేల కోట్లు తీసుకున్నారని.. ఇప్పుడు రెండో విడత కోసం మరో రూ.5వేల కోట్లు అప్పు చేసిందని తెలిపారు. మొత్తం అప్పు రూ.9వేల కోట్లు కాగా.. ఇది కాస్త 11శాతం వడ్డీతో కలిపి ఏడేళ్లకు 16 వేల కోట్లకు చేరుకుంటుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వివరించింది. లబ్ధిదారుల నుంచి 25శాతం, ఫెడరేషన్ ద్వారా 75శాతం డబ్బుతో గొర్రెలు కొనివ్వాలీ కానీ.. ప్రభుత్వ గొర్రెలకు బదులు అకౌంట్లలో డబ్బులు జమ చేసిందని NCDC దృష్టికి తీసుకెళ్లింది. మునుగోడు బైపోల్ సందర్భంగా గొల్ల కురుమల అకౌంట్లలో డబ్బులు వేసిందని.. 11శాతం వడ్డీతో అప్పు తీసుకుని గొర్రెలు కొనివ్వకుండా డబ్బు జమ చేయడమంటే ప్రజాధనాన్ని వృధా చేయడమే అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభిప్రాయపడింది.

16 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న గొర్రెల పంపకం పథకానికి మిడ్ టర్మ్ అప్రైజల్ అవసరమని ఫోరం అభిప్రాయపడింది. ఏదైనా ఒక సంస్థతో దీనిపై అధ్యయనం చేయించాలని.. అప్పటి వరకు రెండో విడత రుణాన్ని ఆపేయాలని కోరింది. 16వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ గొర్రెల పంపకం పథకం అమలు తీరు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందంటూ.. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు ఫోరం కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు.