హుజురాబాద్ ఉప ఎన్నికయ్యే వరకు దళితబంధు ఆపాలి

హుజురాబాద్ ఉప ఎన్నికయ్యే వరకు దళితబంధు ఆపాలి

హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధుతో పాటు ఇతర కార్యక్రమాలు ఆపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి. బై పోల్ ను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ దళితబంధు కార్యక్రమాన్ని మొదలుపెట్టారని వివరించారు. పథకం అమలుపై మాట్లాడిన సీఎం... ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకేనని చెప్పారని ఈసీకి తెలిపారు. బై పోల్ ముందు 3 వేల కోట్ల రూపాయల పథకాల ప్రకటనలు కేవలం ఓటర్లను ప్రలోభపెట్టడానికేనని ఆరోపించారు. వచ్చే నెలలో హుజురాబాద్ లో వెయ్యి కోట్ల రూపాయల నగదు బదిలీ చేయబోతున్నారని చెప్పారు. దీంతో పాటు హుజురాబాద్ దళితులతో మాట్లాడిన సీఎం కేసీఆర్... వారికి ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇల్లులేని వారందరికీ ఇల్లు, 10 రోజుల్లో పట్టేదారు పాసు పుస్తకాల పంపిణీ, రేషన్ కార్డులు, పించన్లు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు.   ఇవన్నీ స్వాగించేవే అయినా... అరకొర నిధులతో అప్పుల్లో ఉన్న... రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు మొత్తం రాష్ట్రానికి వర్తింపచేయడం అయ్యే పనికాదన్నారు. ఉప ఎన్నికల కోసమే దళితబంధు అమలు చేస్తున్నామని CM KCR  చెప్పడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు పద్మనాభరెడ్డి. సీఎం ప్రకటించిన పథకాలు ఉప ఎన్నిక అయ్యే వరకు ఆపాలని కోరారు.