సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్లు అందించిన నలుగురు అరెస్ట్

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్లు అందించిన నలుగురు అరెస్ట్

బషీర్ బాగ్, వెలుగు: దేశవ్యాప్తంగా 83 కేసుల్లో సైబర్ క్రిమినల్స్ రూ. 5 కోట్ల నగదు ట్రాన్సాక్షన్ చేసేందుకు బ్యాంకు అకౌంట్లు ఇచ్చిన నలుగురిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఒక ల్యాప్ టాప్, మూడు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు గురువారం పోలీసులు మీడియాకు తెలిపారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్ ఖాతాలు అందించేందుకు రూ. లక్షకు రూ. 1500 కమీషన్  ఉప్పల్ కు చెందిన సురేంద్ర, నరేశ్ బాబు తీసుకున్నట్టు తేలింది. 

మరో కేసులో క్రిప్టో ఎక్స్చేంజ్ ట్రేడింగ్ బిజినెస్ లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సంగారెడ్డి జిల్లాకు చెందిన సాయిగౌడ్, సాయికుమార్ బల్కంపేట్ కు చెందిన ఓ వ్యక్తిని నమ్మించి రూ. 58.66 లక్షలు సైబర్ నేరగాళ్లకు ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.  అయితే.. నిందితులు 5 శాతం కమీషన్ పై  క్రిప్టో ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ చేసేవారు. ఇలా 45 కేసుల్లో రూ. 13 కోట్లు సైబర్ క్రైమ్ నిందితులు కొట్టేశారు. ఇందులో 3 కేసులు రాష్ట్రానికి చెందినవి. కాగా వీరిద్దరితో పాటు పింకు, శరత్ సైబర్ క్రైమ్ నేరస్తులకు సహకరించినట్టు గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.