కుషాయిగూడలో యువకుడి హత్య కేసులో నలుగురి అరెస్ట్

కుషాయిగూడలో యువకుడి హత్య కేసులో నలుగురి అరెస్ట్

కుషాయిగూడ, వెలుగు: కంపెనీలో పనిచేసే టెక్నీషియన్​ను చంపిన ఓనర్ తో పాటు మరో ముగ్గురిని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..  మహారాష్ట్రకు చెందిన మోసిన్ పాటిల్(30) ఐదు నెలల కిందట ఉపాధి కోసం సిటీకి వచ్చాడు. ఏఎస్​రావునగర్​లోని ‘సిరా’ లిఫ్ట్ రిపేర్, సర్వీస్ కంపెనీలో టెక్నీషియన్ గా చేరాడు. కొత్త లిఫ్ట్ ఇన్ స్టాలేషన్, రిపేర్ కోసం కంపెనీకి వచ్చే కస్టమర్లతో మోసిన్ పరిచయాలు పెంచుకున్నాడు. తన పర్సనల్ నంబర్ ను వారికి ఇచ్చి సొంతంగా వెళ్లి పనిచేయడం మొదలుపెట్టాడు.  సిరా కంపెనీ ఓనర్ రవి(29) ఈ విషయం తెలుసుకుని మోసిన్​ను మందలించాడు. ఈ నెల 21న రాత్రి మోసిన్​ను కలిసిన కంపెనీ డ్రైవర్ శ్రీను(19) కరీంనగర్​లో పని ఉందంటూ అతడిని కారులో ఎక్కించుకుని వెళ్లాడు. శ్రీను ఫ్రెండ్ శ్రీకాంత్​రెడ్డి(25) సైతం అదే కారులో వచ్చాడు. శామీర్ పేటలోని దొంగల మైసమ్మ చౌరస్తా వద్దకు రాగానే  రవి(29), అతడి ఫ్రెండ్ శేఖర్(23) కారులో ఎక్కారు.

తుర్కపల్లి దాబా వద్ద కారు ఆపి ఐదుగురు కలిసి మద్యం తాగారు. అదే టైమ్ లో మోసిన్ సెల్​ఫోన్​ను తీసుకున్న రవి అతడి కాల్ లిస్ట్ ను చెక్ చేశాడు. తన కంపెనీకి వచ్చే కస్టమర్ల నంబర్లు ఉండటంతో..  మోసిన్ సొంతంగా వారితో కాంటాక్ట్ అవుతున్నట్లు  గుర్తించాడు. దాబా నుంచి అందరూ కారులో ఘట్ కేసర్ వైపు బయలుదేరారు. రవి, శేఖర్, శ్రీకాంత్. శ్రీను ఈ నలుగురు కలిసి కారులోనే మోసిన్ మెడకు టవల్ చుట్టి చంపేశారు. అతడి సెల్ ఫోన్ ను బయటికి విసిరేశారు. బాచారం ఏరియాలోని మూసీ నదిలో డెడ్ బాడీని పడేసి వెళ్లిపోయారు. మోసిన్ తండ్రి గప్పల్ పటేల్ కంప్లయింట్​తో కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సిరా కంపెనీ ఓనర్ రవితో పాటు మిగతా ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.