మేకలు, గొర్రెలను ఎత్తుకెళ్తున్న నలుగురు ఆటో డ్రైవర్లు అరెస్ట్.

మేకలు, గొర్రెలను ఎత్తుకెళ్తున్న నలుగురు ఆటో డ్రైవర్లు అరెస్ట్.

ఇబ్రహీంపట్నం, వెలుగు: చెడు వ్యసనాలకు బానిసలై గొర్రెలు, మేకలు ఎత్తుకెళ్లడంతోపాటు ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు ఆటో డ్రైవర్లను ఆదిబట్ల పోలీసులు సోమవారం అరెస్ట్​చేశారు. మరో డ్రైవర్​పరారీలో ఉన్నాడు. ఇన్​స్పెక్టర్​టి.రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్​పీఎస్​పరిధిలోని షాహిన్​నగర్​కు చెందిన షేక్​ఇక్బాల్, జాఫర్, సయ్యద్​అహ్మద్, మహమ్మద్​గౌస్, పాత బస్తీకి చెందిన షేక్​అమీర్​మద్యానికి బానిసలై, ఈజీ మనీ కోసం చోరీలకు ప్లాన్​చేశారు. 

మొదట పార్క్ చేసిన వెహికల్స్​నుంచి డీజిల్, ఇండ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. బాచుపల్లి పీఎస్​పరిధిలో 3, చాంద్రాయణగుట్టలో ఒకటి, చార్మినార్ లో 2, హయత్ నగర్​లో 5, ఇబ్రహీంపట్నంలో 3, కందుకూరులో ఒకటి, మంచాలలో 2, పహాడీషరీఫ్​లో 4, యాచారం, మైలార్​దేవ్ పల్లి, వనస్థలిపురం పీఎస్​ల పరిధిలో ఒక్కో చోరీ చేసి జైలుకెళ్లారు. రిలీజ్​అయ్యాక ఆటో డ్రైవర్లుగా మారారు. సంపాదన సరిపోక తిరిగి చోరీలు మొదలుపెట్టారు. ఉప్పల్ సమీపంలోని చిలుకానగర్​లో ఓ కారును దొంగిలించారు. 

తర్వాత అబ్దుల్లాపూర్ మెట్, ఆదిబట్ల, పహాడీషరీఫ్ పీఎస్​ల పరిధిలో గొర్రెలు, మేకలు ఎత్తుకెళ్లారు. ఆదిబట్ల పీఎస్​పరిధిలోని వండర్​లా సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇక్బాల్, జాఫర్, అహ్మద్, మహమ్మద్ గౌస్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా గొర్రెలు, మేకల చోరీ విషయం బయటపడింది. వారి నుంచి రూ.2 లక్షల50వేలు క్యాష్​, రూ.4లక్షల50వేలు విలువ చేసే 48 గొర్రెలు, మేకలతో పాటు ఇండికా కారు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. షేక్ అమీర్ పరారీలో ఉన్నాడు.