
- తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్
- ప్రొటోకాల్, సమస్యలపైనే కలిశామని వెల్లడి
- డిఫేమేషన్ వేస్తామన్న సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని చెప్పారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్‌రెడ్డి (దుబ్బాక), కె.మాణిక్‌రావు (జహీరాబాద్) వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఒకేసారి సీఎంతో భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు.
తాము ఎవరితోనూ చర్చలు జరపలేదని, మెదక్ జిల్లా సమస్యలు వివరించేందుకే సీఎంను కలిశామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. కొందరు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, తమ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే పరువునష్టం దావా వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎంను కలిసి మెదక్ జిల్లా సమస్యల గురించి చెప్పామని, మొన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. జిల్లాలో ప్రొటోకాల్ పాటించడం లేదని సీఎంకు ఫిర్యాదు చేశామని అన్నారు. మీడియా సమావేశంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఉన్నారు.