జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు కూలీలు మృతి

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు కూలీలు మృతి

జగిత్యాల/మల్లాపూర్, వెలుగు: జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. పసుపు తవ్వేందుకు వెళ్లి ట్రాక్టర్​పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరికాసేపట్లో ఇండ్లకు చేరుకుంటామనగా, గ్రామ శివారులో ట్రాక్టర్​అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు రైతు కూలీలు, ఒక బాలిక అక్కడికక్కడే చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్​మండలంలోని మొగిలిపేట కు చెందిన పలువురు మహిళా కూలీలు మంగళవారం గ్రామానికే చెందిన గంగాధర్ చేనులో పసుపు తవ్వేందుకు వెళ్లారు. సాయంత్రం ట్రాక్టర్ పై ఇండ్లకు వెళ్తుండగా.. మొగిలిపేట శివారులో అదుపుతప్పి బోల్తా పడింది.

 ఈ ఘటనలో మంగళారపు లలిత(42), సంపంగి లక్ష్మి అలియాస్ సాయమ్మ(35), రొడ్డ వైష్ణవి(13), పెద్దిరెడ్డి గంగు(45) స్పాట్​లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన గంగును జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి, మరో ఇద్దరిని మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలన్నీ రోజువారీ కూలీ పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. చిన్న వయసులో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకు వ్యవసాయ పనులకు వెళ్లిన వైష్ణవి చనిపోవడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన మొగిలిపేటలో విషాదం నింపింది.