పదిహేనేండ్ల తర్వాత  సుడి తిరిగింది

V6 Velugu Posted on Sep 15, 2021

మధ్యప్రదేశ్​లో నలుగురు కూలీలకు 40 లక్షల విలువైన వజ్రం దొరికింది

పన్నా(మధ్యప్రదేశ్): వజ్రాల వేటలో పదిహేనేండ్లుగా కష్టపడుతూనే ఉన్నరు.. చాలా చోట్ల భూమిని లీజుకు తీసుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నరు. ప్రతీసారీ వారికి నిరాశే ఎదురైంది. ఈసారి మాత్రం వాళ్ల సుడి తిరిగింది. ఏకంగా 40 లక్షలకు పైన విలువ చేసే వజ్రం దొరికింది. ఇన్నేండ్ల కష్టానికి ప్రతిఫలం దొరికినట్లైంది. మధ్యప్రదేశ్​లోని పన్నా జిల్లాలో నలుగురు కూలీలకు 8.22 కేరట్ల విలువైన డైమండ్​ దొరికిందని అక్కడి అధికారులు చెప్పారు. దాని విలువ నలభై లక్షలకు పైనే ఉంటుందని, త్వరలో దానిని వేలం వేస్తామని పన్నా కలెక్టర్​ వివరించారు.  జిల్లాకు చెందిన రతన్​లాల్​ ప్రజాపతి, మరో ముగ్గురితో కలిసి వజ్రాల గనులలో పనిచేస్తున్నారు. వజ్రాలు ఎక్కువగా దొరికే చోట భూమిని లీజుకు తీసుకుని తవ్వకాలు చేస్తుండేవాళ్లు. ఈ వజ్రాల వేటలో ఏండ్లు గడిపేశారు. చాలా చోట్ల భూమిని లీజుకు తీసుకున్నారు. ఇన్నేండ్లలో చిన్నాచితక ముడి వజ్రమే తప్ప ఓ మోస్తరు వజ్రం కూడా దొరకలే. జిల్లాలోని హీరాపూర్​ తాపరియాన్​ ఏరియాలో కొంత భూమిని లీజుకు తీసుకుని ఎప్పట్లాగే వజ్రాల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ పొలంలో వెతుకుతుంటే సోమవారం 8.22 కేరట్ల విలువైన వజ్రం దొరికింది. దానిని స్థానికంగా ఉండే వజ్రాల నిపుణులకు చూపిస్తే.. విలువైన వజ్రమని, 40 లక్షల దాకా పలుకుతుందని చెప్పారట. దీంతో రతన్​లాల్​ బృందం ఆ ముడి వజ్రాన్ని ప్రభుత్వ ఆఫీసులో అప్పగించారు. స్థానిక చట్టాల ప్రకారం.. రైతులు, కూలీలకు దొరికిన వజ్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, వేలం వేస్తుంది. వచ్చిన సొమ్ములో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని, పన్నులను మినహాయించుకుని, మిగతా సొమ్మును అధికారులు రైతులకు అందజేస్తారు. రతన్​ లాల్​ అప్పగించిన వజ్రాన్ని ఈ నెల 21న వేలం వేస్తామని, రాయల్టీ పోను మిగతా మొత్తాన్ని అతనికే ఇచ్చేస్తామని అధికారులు చెప్పారు. కాగా, పదిహేనేండ్లుగా వజ్రాల వేటలోనే జీవితాన్ని గడిపేశామని, ఇప్పుడు రాబోయే సొమ్మును తమ పిల్లలకు మంచి విద్యను అందించేందుకు ఉపయోగిస్తామని రతన్​లాల్ చెప్పారు.

Tagged Madhya Pradesh, laborers, diamond,

Latest Videos

Subscribe Now

More News