మెదక్, వెలుగు: నేషనల్ సైన్స్ ఫెయిర్ కు మెదక్ జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్ట్ లు ఎంపికైనట్టు డీఈఓ విజయ, డీఎస్ఓ రాజిరెడ్డి తెలిపారు. జనవరి 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు కామారెడ్డిలో నిర్వహించిన స్టేల్ టవల్ సైన్స్ ఫెయిర్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 21 ప్రాజెక్ట్ లను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎవల్యూషన్ కమిటీ.. నేషనల్ లెవల్ సైన్స్ ఫెయిర్ కు ఎంపిక చేసినట్టు వివరించారు. అందులో మెదక్ జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్ట్ లు ఉన్నట్టు తెలిపారు.
తూప్రాన్ గీతా హైస్కూల్ స్టూడెంట్ బి.మహతి రూపొందించిన 'వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ లకు ప్రత్యామ్నాయం' అనే ఎగ్జిబిట్, మెదక్ మండలం మాచవరం సిద్ధార్థ రూరల్ హై స్కూల్ స్టూడెంట్ అక్షయ్ రూపొందించిన 'ఎమర్జింగ్ టెక్నాలజీ' అనే ఎగ్జిబిట్, పాపన్నపేట మండలం చీకోడ్ లింగాయిపల్లి హైస్కూల్ స్టూడెంట్ గణేష్ రూపొందించిన ' నీటి సంరక్షణ, నిర్వహణ' ఎగ్జిబిట్, మెదక్ సరస్వతీ కాన్వెంట్ హైస్కూల్ స్టూడెంట్ ఆసీఫా రూపొందించిన 'వినోద భరిత గణితం' ఎగ్జిబిట్ నేషనల్ లెవల్ సైన్స్ ఫెయిర్ కు ఎంపికయ్యాయని వెల్లడించారు.
ఆయా విద్యార్థులను, గైడ్ టీచర్ లను కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేష్ అభినందించారు. ఇదే స్పూర్తి తో జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రాణించి జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు.
