గాంధీలో ఒక్కరోజే నలుగురు యాచకులు మృతి

గాంధీలో ఒక్కరోజే నలుగురు యాచకులు మృతి
  • ప్రతీ నెల పదుల సంఖ్యలో చనిపోతున్న వైనం
  • అన్నదానంతో ఇక్కడే పడిగాపులు
  • వివరాల్లేక అంత్యక్రియలకు జీహెచ్ఎంసీకి అప్పగింత 

పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో గురువారం ఒక్కరోజే నలుగురు యాచకులు మృతి చెందారు. దవాఖాన ఆవరణలో అనారోగ్యంతో, గాయాలతో ఉన్న 50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి, 27 ఏళ్ల యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇదే దవాఖాన ఆవరణలోని 101 బిల్డింగ్ ఎదురుగా దాదాపు--50 ఏండ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. మైలార్ గడ్డలోని బాలాజీ స్వీట్ హౌస్ వద్ద అనారోగ్యంతో ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని పెట్రోలింగ్ సిబ్బంది గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ నలుగురి వివరాలేవీ లేకపోవడంతో చిలకలగూడ పోలీసులు వారి మృతదేహాలను దవాఖాన మార్చురీలో భద్రపరిచారు.

దాతల అన్నదానంతో ఇక్కడే..

గాంధీ ఆస్పత్రి ఆవరణలో యాచకుల మరణాలు ఆగడం లేదు. దవాఖాన ఎదుట దాతలు నిత్యం అన్నదానం చేస్తుండడంతో యాచకులు తింటూ ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నారు. అనారోగ్యం బారిన పడి కొందరు, వయోభారం, మద్యానికి బానిసై ఇంకొందరు.. ఇలా ప్రతీ నెల పదుల సంఖ్యలో చనిపోతున్నారు. అయితే వారి వద్ద ఎలాంటి వివరాలు లేకపోవడంతో పోలీసులు డెడ్ బాడీలను గాంధీ ఆస్పత్రి మార్చురీలో మూడు రోజులపాటు ఉంచి తర్వాత అంత్యక్రియల కోసం జీహెచ్ఎంసీకి అప్పగిస్తున్నారు. దవాఖాన ఎదుట అన్నదానం ఆపేసి, యాచకులను ఆశ్రమాలకు పంపిస్తే వారి చావులకు అడ్డుకట్ట పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.