
- ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, కృష్ణ, రిసెప్షనిస్ట్ నందినిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- 12కి చేరిన అరెస్టుల సంఖ్య
- కొనసాగుతున్న ముగ్గురి విచారణ
- వసూలు చేసిన కోట్లాది రూపాయలతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తింపు
పద్మారావునగర్, వెలుగు: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో నలుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు. శనివారం సృష్టి సెంటర్‌కు సంబంధించిన ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్‌తో పాటు రిసెప్షనిస్ట్ నందినిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మరో ఏజెంట్కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలతోపాటు విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో పిల్లలను విక్రయించే వారి కోసం ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, కృష్ణ పనిచేశారని సమాచారం. ఈ వివరాలను ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లోని సృష్టి క్లినిక్‌లోని రిసెప్షనిస్ట్ నందినికి చేరవేసేవారు. కాగా, ఈ కేసులో ఇంతకుముందు 8 మంది నిందితులను గోపాల పురం పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా నలుగురిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో అరెస్ట్ అయినవారి సంఖ్య 12కు చేరింది.
ఫామ్‌హౌస్‌లు, బిల్డింగ్‌లు, స్థలాలు కొనుగోలు!
సరోగసీ ముసుగులో డాక్టర్ నమ్రత చేసిన అరాచకాలు తెలుసుకుంటున్న పోలీసులు షాక్ అవుతున్నారు. విశాఖపట్నం పరిసరాల ప్రాంతాల్లో ప్లాన్ ప్రకారం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ.. అక్కడ గర్బిణిలను గుర్తించి, వారికి డబ్బులు ఆశచూపి, హైదరాబాద్‌కు తీసుకువచ్చేవారని తెలిసింది. సిటీకి వచ్చిన తర్వాత వారికి కాన్పు చేసి, పుట్టిన బిడ్డను ఇవ్వకుండా.. వారికి డబ్బులు ఇచ్చి, పంపించేవారని సమాచారం. ఇలా శిశువులను సేకరించి, సరోగసీ పేరుతో పిల్లలు లేని దంపతులకు అంటగడుతూ, కోట్లాది రూపాయలు సంపాందించారని విచారణలో తేలినట్టు తెలిసింది. ఆ డబ్బుతో భారీగా స్థలాలు, ఫామ్‌హౌస్‌లు, బిల్డింగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఎక్కువగా సికింద్రాబాద్,యూసుఫ్‌గూడ, వైజాగ్, విజయవాడ తదితర ప్రాంతాల్లో వీటిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
కొనసాగుతున్న విచారణ
సృష్టి అక్రమ సరోగసీ, ఐవీఎఫ్,శిశువుల కొనుగోలు కేసులో అరెస్టై.. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రత, సి. కళ్యాణి అచ్చాయమ్మ, ధనశ్రీ సంతోషిని గోపాలపురం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో నిందితుల కస్డడీ విచారణ కొనసాగుతున్నది. ‘‘సరోగసీ పేరుతో ఇప్పటివరకూ ఎంతమంది సంతానం లేని దంపతులకు శిశువులను బయట కొనుగోలు చేసి, అప్పగించారు? ఎంతమంది దంపతుల నుంచి శిశువులను కొనుగోలు చేశారు? ఈ వ్యవహారాల్లో ఎంత డబ్బు చేతులు మారాయి? ” అనే అంశాలపై నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరిచ్చే సమాచారం మేరకు ఈ కేసుకు సంబంధించి మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిందితులను విచారిస్తున్న నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం వద్ద భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.