న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో మరో నలుగురిని నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారిని పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయ్, సహారన్‌పూర్‌లోని డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, అనంత్‌నాగ్‌కు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్, షోపియాన్‌కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగేగా గుర్తించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన ప్రొడక్షన్ వారెంట్ల ఆధారంగా జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో నిందితులను అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ.
ఢిల్లీ బ్లాస్ట్ ప్రధాన నిందితుడు, సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ నబీకి ఈ నలుగురు అనుచరులని తెలిపింది. ఢిల్లీ పేలుడు ఉగ్రవాద కుట్రకు లాజిస్టిక్స్, ప్రణాళిక, ఆన్-గ్రౌండ్ సదుపాయానికి ఈ నలుగురు సహయపడారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ నలుగురు జమ్మూ కాశ్మీర్ పోలీసుల అదుపులో ఉండగా.. తాజాగా ఎన్ఐఏ వీరిని అదుపులోకి తీసుకుంది. తాజా అరెస్టులతో ఢిల్లీ బ్లాస్ట్ కేసులో అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది. అమీర్ రషీద్ అలీ, జాసిర్ బిలాల్ వాని అలియాస్ డానిష్ ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్న సంగతి తెలిసిందే.
2025, నవంబర్ 11న భారీ పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించింది.
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. పేలుడు వెనుక ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడానికి వివిధ రాష్ట్ర పోలీసు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకుపోతుంది. ఈ కేసులో పూర్తి కుట్రను వెలికితీసేందుకు అన్ని ఆధారాలను అన్వేషిస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది.
