గాలివాన బీభత్సానికి నలుగురు బలి

గాలివాన బీభత్సానికి నలుగురు బలి
  • మంచిర్యాల జిల్లా కొత్తూరు, గంపలపల్లిలో అర్ధరాత్రి తర్వాత కూలిన రేకుల షెడ్లు
  • వడ్లకుప్పల కాపలాకు వెళ్లి ముగ్గురు, కొడుకును బస్సు ఎక్కించి వస్తూ మరొకరు మృతి
  • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
  • మంచిర్యాల జిల్లాలో విషాదం
  • మృతుల కుటుంబాలకు న్యాయం 
  • చేయాలని బీఆర్ఎస్ లీడర్ల ధర్నా
  • ఒక్కో ఫ్యామిలీకి  రూ.2 లక్షల చొప్పున మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సాయం


మంచిర్యాల/ లక్షెట్టిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లాలో గాలివాన బీభత్సానికి నలుగురు బలయ్యారు. లక్షెట్టిపేట మండలం గంపలపల్లిలో  మంగళవారం రాత్రి వడ్ల కుప్పల వద్ద కాపలాకు వెళ్లిన తండ్రికొడుకులు, కొత్తూరులో యువకుడితో పాటు కొడుకును హైదరాబాద్ బస్సు ఎక్కించి వస్తూ మరో రైతు మృత్యువాత పడ్డారు.  గాలివానకు రేకుల షెడ్లు కూలిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.  గంపలపల్లికి చెందిన తనుగుల నాగరాజు(48) తాను పండించిన వడ్లను గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో కుప్పలు పోశాడు. మంగళవారం అర్ధరాత్రి భారీ ఈదురుగాలులతో వర్షం పడడంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి తన కొడుకు అభిరామ్ (22)ను తీసుకొని ధాన్యంపై టార్పాలిన్లు కప్పడానికి వెళ్లారు. 

గాలి తీవ్రత ఎక్కువ కావడంతో సమీపంలోని ఓ మిల్లు వద్ద ఉన్న షెడ్డులోకి చేరుకున్నారు. గాలివాన బీభత్సానికి ఆ షెడ్డు కుప్ప కూలిపోయింది. అభిరామ్ స్పాట్ లోనే చనిపోగా, నాగరాజుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకొని అతడిని  కరీంనగర్ హాస్పిటల్ కు తరలించగా, బుధవారం ఉదయం మృతిచెందాడు. అలాగే కొత్తూరు గ్రామానికి చెందిన కొంతమంది రైతులు కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పడానికి వెళ్లారు. గాలివాన ఎక్కువ కావడంతో సమీపంలోని ఓ షెడ్డు వద్దకు వెళ్లి నిల్చున్నారు. అదే టైమ్ లో దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కి లచ్చన్న(50) తన కొడుకును హైదరాబాద్ వెళ్లడానికి బైక్ పై లక్షేట్టిపేట బస్టాండ్ లో బస్సు ఎక్కించి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొత్తూరు కొనుగోలు సెంటర్ దగ్గర షెడ్డు కింద ఉన్న జనాలను చూసి తను కూడా అక్కడికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న గోడ కూలడంతో కొత్తూరుకు చెందిన గుండారపు వెంకటేశ్ (24) స్పాట్ లోనే చనిపోయాడు. నెల్కి లచ్చన్నతో పాటు మరో ముగ్గురు రైతులకు గాయాలయ్యాయి. వీరిని లక్షేట్టిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ లచ్చన్న మృతి చెందాడు.

కొడుకును బస్సు ఎక్కించి వస్తూ..

కొత్తూరు కొనుగోలు కేంద్రం సమీపంలో వర్షానికి తలదాచుకున్న క్రమంలో  దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కి లచ్చన్న మృతి చెందాడు. డిగ్రీ చదువుతున్న తన కుమారుడిని హైదరాబాద్ బస్సు ఎక్కించి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో గాలివాన ఎక్కువ కావడంతో  కొత్తూరు సమీపంలోని ఓ షెడ్డు కిందకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు గోడ కూలిపోవడంతో మృతి చెందాడు. కరీంనగర్ వరకు వెళ్లిన మనోజ్ తండ్రి మరణించాడనే విషయం తెలుసుకొని హాస్పిటల్ కు చేరుకున్నాడు. మనోజ్, కూతురు అనూష తండ్రి మృతదేహంపై పడి రోదిస్తుండడం పలువురిని కలిచివేసింది.

హాలిడేస్ కోసం వచ్చి..

కొత్తూరు వద్ద మృతి చెందిన  గుండారపు వెంకటేశ్ హైదరాబాద్ లో ఎంబీఏ చదువుతున్నాడు. దాంతోపాటు కానిస్టేబుల్ పోస్టు కోసం ప్రిపేర్ అవుతున్నాడు. హాలిడేస్ ఉండడంతో ఇంటికి వచ్చిన వెంకటేశ్   కొనుగోలు కేంద్రంలో ఉన్న తమ ధాన్యం తడవకుండా  కాపాడుకోవడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. హాలిడేస్ లో ఇంటికి వచ్చినప్పుడల్లా వ్యవసాయం చేసుకుంటున్న తన తండ్రికి సాయపడుతూ ఉంటాడు. 

మరణంలోనూ కలిసే..

గంపలపల్లి ఘటనలో మృతి చెందిన తండ్రి కొడుకులు ఎంతో కలిసిమెలిసి ఉండేవారు. డిగ్రీ పూర్తి చేసిన అభిరామ్ వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నాడు. చివరకు మరణంలోనూ కలిసి వెళ్లడంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. మృతుని తమ్ముడు ఏడుస్తున్న తీరు పలువురిని కంటనీరు పెట్టించింది.

గాలివాన దెబ్బకు కూలిపోయిన 
85 ఏండ్ల వృక్షం

లక్సెట్టిపేటలోని తహసిల్దార్ కార్యాలయం ముందు 85 ఏళ్ల  భారీ వృక్షం మంగళవారం రాత్రి ఈదురు గాలులకు కూలిపోయింది. 1941లో తహసీల్దార్ కార్యాలయంతో పాటు స్థానిక ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనం కూడా ఏకకాలంలో నిర్మించారు. అప్పటికే ఈ చెట్టు ఉన్నట్లు చెప్పారు. కాగా, ఈదురుగాలుల తీవ్రతకు మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లావ్యాప్తంగా వందలాది చెట్లు నేలకూలాయి.