ప్రపంచ అభివృద్ధికి నాలుగు ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌.. జీ20 లీడర్స్ సమిట్‌‌‌‌‌‌‌‌లో ప్రధాని మోడీ ప్రతిపాదనలు

ప్రపంచ అభివృద్ధికి నాలుగు ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌.. జీ20 లీడర్స్ సమిట్‌‌‌‌‌‌‌‌లో ప్రధాని మోడీ ప్రతిపాదనలు

జొహన్నెస్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌: ప్రపంచ అభివృద్ధే లక్ష్యంగా నాలుగు కొత్త కార్యక్రమాలను జీ20 వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. జీ20 దేశాల ఆధ్వర్యంలో గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌ రిపాజిటరీ, ఆఫ్రికా స్కిల్స్ మల్టీప్లయర్ ఇనీషియేటివ్, గ్లోబల్ హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయడంతో పాటు డ్రగ్–టెర్రర్ నెక్సస్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జీ20 లీడర్ల సమిట్ శనివారం దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ నాలుగు కార్యక్రమాలు ప్రపంచ సమగ్రాభివృద్ధికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 

‘‘మన సంప్రదాయ జీవన విధానాలు, పద్ధతులను గుర్తించి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ జ్ఞానాన్ని సేకరించి, భవిష్యత్తు తరాలకు అందించాలి. ఇందుకోసం జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీని ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో భారత్‌‌‌‌‌‌‌‌కు గొప్ప చరిత్ర ఉంది. ఈ రిపాజిటరీ ప్రపంచ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం సమష్టి జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది” అని తెలిపారు. ‘‘ప్రపంచ అభివృద్ధికి ఆఫ్రికా అభివృద్ధి ఎంతో కీలకం. ఈ విషయంలో ఆఫ్రికాకు భారత్ అండగా ఉంటుంది. ఆఫ్రికా అభివృద్ధే లక్ష్యంగా జీ20 ‘ఆఫ్రికా స్కిల్స్ మల్టీప్లయర్ ఇనిషియేటివ్’ను చేపట్టాలి.

 వచ్చే పదేండ్లలో 10 లక్షల మంది ఆఫ్రికన్లకు నైపుణ్య శిక్షణనివ్వాలి. వాళ్లు మరింత మందికి శిక్షణనిస్తారు. అలా దీన్ని కొనసాగిస్తూ వెళ్తే.. ఆఫ్రికా అభివృద్ధి పథంలో నడుస్తుంది” అని చెప్పారు. ‘‘హెల్త్ ఎమర్జెన్సీలను ఎదుర్కోవడానికి జీ20 గ్లోబల్ హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలి. ఇది కష్ట సమయంలో ఒకరికొకరు సహకరించుకోవడానికి ఉపయోగడపడుతుంది. 

ప్రకృతి విపత్తులు, హెల్త్‌‌‌‌‌‌‌‌ ఎమర్జెన్సీలు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టేలా ఈ టీమ్‌‌‌‌‌‌‌‌ను రెడీ చేయాలి” అని సూచించారు. ‘‘ప్రపంచానికి ఉగ్రవాదం సవాలుగా మారింది. డ్రగ్‌‌‌‌‌‌‌‌–టెర్రర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెక్సస్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టాలి. డ్రగ్‌‌‌‌‌‌‌‌ దందా ద్వారా ఉగ్రవాదులకు నిధులు అందుతున్నాయి. అన్ని దేశాలు కలసికట్టుగా పోరాడితే, దీన్ని అంతం చేయొచ్చు” అని పిలుపునిచ్చారు.

అమెరికా బాయ్‌‌‌‌‌‌‌‌కాట్.. 

జీ20 సదస్సును అమెరికా బాయ్‌‌‌‌‌‌‌‌కాట్ చేసింది. సమిట్‌‌‌‌‌‌‌‌కు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ హాజరుకాలేదు. ప్రతినిధులనూ పంపలేదు. సౌతాఫ్రికాలో శ్వేతజాతీయులపై హింస జరుగుతున్నదని, అలాంటి చోట సదస్సు నిర్వహించడం అవమానకరమని ట్రంప్ అన్నారు.