వీడని పంజాగుట్ట చిన్నారి మర్డర్ మిస్టరీ

వీడని పంజాగుట్ట చిన్నారి మర్డర్ మిస్టరీ

హైదరాబాద్‌లో మరో చిన్నారి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. పంజాగుట్టలో అనుమానాస్పదంగా మృతి చెందిన చిన్నారి కేసు విషయంలో పోలీసులు విచారణ ఇంకా కొనసాగుతోంది. దీనిపై ఇప్పటివరకు ఇంకా పూర్తి సమాచారం రాలేదన్నారు. దాదాపు వంద సీసీ కెమెరాలు పరిశీలించామన్నారు పోలీసులు. హత్యకు గురైన చిన్నారి ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిస్తున్నట్లుగా తెలిపారు. చిన్నారి ఒంటిపై పాత గాయాలే ఉన్నాయన్నారు. కానీ కొత్తగా గాయాలే ఏవీ లేవని పోలీసులు పేర్కొన్నారు. చిన్నారిని ఎక్కడో హత్య చేసి పంజాగుట్టలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ లో చిన్నారుల మిస్సింగ్ కేసులు పై కూడా ఆరా తీస్తున్నామన్నారు. మృతి చెందిన చిన్నారి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరి కొన్ని విషయాలు బయట పడతాయన్నారు.  గురువారం దీపావళి పండగ కావడంతో ఈ కేసుకు సంబంధించి కొన్ని రిపోర్ట్స్, డేటా రాలేదన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఈ కేసులో పురోగతి వస్తుందని పోలీసులు తెలిపారు. 

చిన్నారి హత్యకేసు వివరాలు చూస్తే.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారకపురి కాలనీలో టెన్నిస్ కోర్టు దగ్గర షాపు పక్కన గుర్తు తెలియని చిన్నారి మృతదేహం పడి ఉంది. అమావాస్య కావడంతో చిన్నారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ చిన్నారిని ఎవరైనా చంపేసి ఇక్కడ వదిలేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. క్షుద్రపూజలు జరిగాయని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా.. స్థానికుల సమాచారం అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేసుకుని వివరాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసి.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. బాలిక శరీరంపై గాయాలున్నాయి. దీంతో బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.