జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు నాలుగేండ్ల ప్రొబేషన్?

జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు నాలుగేండ్ల ప్రొబేషన్?

జీతం రూ.15 వేల నుంచి రూ.30 వేలకు పెంపు
హైదరాబాద్, వెలుగు: జూనియర్ పంచాయతీ సెక్రటరీ ( జేపీఎస్ ) ల ప్రొబేషన్ టైమ్​ను రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు సర్కార్ పెంచనుంది. అలాగే వారి జీతాన్ని కూడా రూ.15 వేల నుంచి రూ.30 వేలకు పెంచనుంది. దీనికి సంబంధించిన ఫైల్​పై సీఎం కేసీఆర్ సంతకం చేసినట్లు సమాచారం. రెండ్రోజుల్లో ఉత్తర్వులు కూడా వెలువడనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. కాగా, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను పోస్టులను ప్రభుత్వం 2019  ఏప్రిల్ లో భర్తీ చేసింది. అప్పుడు వారి ప్రొబేషన్ టైమ్ ను రెండేళ్లుగా ఖరారు చేసి రూ.15 వేల వేతనాన్ని నిర్ణయించింది. ఈ ప్రొబేషన్ టైమ్ కూడా పూర్తయి 2 నెలలు గడిచింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జేపీఎస్​ల ప్రొబేషన్ టైమ్ ను రెండేళ్ల నుంచి నాలుగేళ్ల నుంచి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రామాల డెవలప్ మెంట్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రొబేషన్ టైమ్ పెంచొద్దు: జేపీఎస్ లు
సీఎం ప్రకటనపై అప్పట్లోనే జేపీఎస్ లు ఫైర్ అయ్యారు. తమకు వేతనం పెంచకున్నా ప్రొబేషన్ టైమ్ ను మాత్రం పెంచొద్దంటున్నారు. తమను గ్రేడ్- 4 పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రొబేషన్ టైమ్ పెంచటంతో జేపీఎస్ లు పెద్ద ఎత్తున తమ ఉద్యోగాలను వదిలిపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే వివిధ కారణాలతో వెయ్యి మంది ఉద్యోగాలు వదులుకున్నారు.