డబుల్ ఇండ్ల పేరిట మోసం.. ఒక్కొక్కరి నుంచి రూ.6 వేల నుంచి లక్ష వరకు వసూల్

డబుల్ ఇండ్ల పేరిట మోసం.. ఒక్కొక్కరి నుంచి రూ.6 వేల నుంచి లక్ష వరకు వసూల్

ఇబ్రహీంపట్నం, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ అక్రమంగా తమ నుంచి డబ్బులు వసూలు చేశారని కొందరు బాధితులు ఆదిబట్ల పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. బాధితుల వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్, వికారాబాద్, ఇతర జిల్లాలకు చెందిన పేద బేడా బుడగ జంగాల వర్గానికి చెందిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కుర్మల్ గూడ, ఇందిరా నగర్ కు చెందిన కళ్లెం అంజయ్య, సునీల్, మరికొంత మంది వ్యక్తులు కలిసి నమ్మించారు. 

ఒక్కొక్కరి నుంచి రూ. 6 వేల నుంచి సుమారు లక్ష వరకు గత మూడేండ్ల కింద వసూల్ చేశారు. ఇప్పటికీ ఇండ్లు రాకపోవడంతో ఏమైనవి అని అడిగితే ఇవ్వకుండా కొందరికి ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇచ్చారు. మరోసారి ఇండ్లు ఏమైనవి అని అడిగితే కలెక్టర్ వద్దకైనా వెళదాం, మా వెంట పెద్దపెద్ద వాళ్లు ఉన్నారని బెదిరింపులకు పాల్పడ్డారు. 

ఈ మేరకు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దాదాపు 30 మందికి పైగా ఆదిబట్ల పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తమతోపాటు 4 వేలకు పైగా బాధితులు ఉన్నారని ఆరోపించారు. ఇండ్లు ఇస్తామని డబ్బులు తీసుకున్న వీడియోలు, ఆడియో క్లిప్పింగులు, డబుల్ ఇండ్లు వచ్చినట్లు తయారు చేసిన ఫోర్జరీ డాకుమెంట్లు, ఇతర ఆధారాలను పోలీసులకు బాధితులు అందజేశారు. 

ఈ విషయమై కళ్లెం అంజయ్యను వివరణ కోరగా ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న విషయం నిజమేనని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి సమయం కావాలని బాధితులతో చెప్పానని అయిన వినకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ మాట్లాడుతూ.. కొందరు బాధితులు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.