ఫ్రీ బస్​పాసులు రెన్యూవల్ చేస్తలేరు

ఫ్రీ బస్​పాసులు  రెన్యూవల్ చేస్తలేరు

    సమ్మె ఉందని చేయబోమంటున్న కౌంటర్  సిబ్బంది

    ఈ మేరకు పైనుంచి ఆదేశాలున్నట్టు వెల్లడి

    ఇబ్బంది పడుతున్న దివ్యాంగులు, ఫ్రీడం ఫైటర్లు

    ప్రతి నెలా 45 వేలకుపైనే పాసుల రెన్యూవల్ కావాలె

రాష్ట్రంలో దివ్యాంగులు, స్వాతంత్ర్య సమరయోధులు వంటివారికి ఇచ్చే ఉచిత బస్​పాసులు రెన్యూవల్​ కావడం లేదు. డబ్బులు చెల్లించే స్టూడెంట్​ పాస్​లు, రూట్​పాసులు మాత్రమే ఇస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఆర్టీసీ సమ్మె నడుస్తోందని, ఫ్రీ బస్​పాసులు ఇవ్వొద్దంటూ పైనుంచి ఆదేశాలు ఉన్నాయని కౌంటర్లలోని సిబ్బంది చెప్తున్నారు. పాస్​ల గడువు ముగియడంతో తాము తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని దివ్యాంగులు, వృద్ధులు, స్వాతంత్ర్య సమరయోధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రెన్యూవల్​ చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

నెలకు 45 వేలకు పైనే రెన్యూవల్..

రాష్ట్రంలో 5.6 లక్షల దివ్యాంగ బస్​పాసులు, ఐదు వేల వరకు స్వాతంత్ర్య సమరయోధుల బస్​పాసులు ఉన్నాయి. వాటిని ఏటా రెన్యూవల్​ చేయాల్సి ఉంటుంది. దివ్యాంగ బస్ పాసులు ప్రతినెలా సుమారు 45 వేల వరకు రెన్యువల్​ అవుతుంటాయి. వారికి హైదరాబాద్​ సిటీ బస్సుల్లో పూర్తి ఉచితంగా, జిల్లాల్లో 50 శాతం రాయితీ ఉంటుంది. ఇందులో వైకల్య శాతం ఎక్కువగా ఉన్నవారికి రాష్ట్రమంతటా ఉచితంగా ఉండటంతోపాటు తోడుగా వచ్చిన ఒకరికి కూడా టికెట్​ చార్జీలో 50% రాయితీ ఇస్తారు. ఇక స్వాతంత్ర్య సమరయోధులకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుంది. బస్​పాసులు రెన్యూవల్​ చేయకపోవడంతో వారు ఇబ్బందిపడుతున్నారు.

మాకేం సంబంధం?

అక్టోబర్​31 వరకు వేలల్లో బస్​పాసుల గడువు ముగిసింది. దీంతో రెన్యూవల్ కోసం కౌంటర్ల దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండటం లేదు. ‘‘కార్మికులు సమ్మెలో ఉన్నారు. ఫ్రీ బస్​పాసులు చేయొద్దని మాకు ఆదేశాలు ఉన్నాయి. వాళ్లు చెప్పినట్లు చేస్తున్నం. మాకేం సంబంధం లేదు. బస్సుల్లో పాసులే చెల్లడం లేదు. రెన్యూవల్​ చేసుకుని ఏం చేస్తరు’’ అని సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. వాస్తవానికి బస్​పాసుల జారీకి, ఆర్టీసీ కార్మికులకు సంబంధమేమీ లేదు. ఆర్టీసీ బస్​పాసుల ప్రక్రియను ఔట్​సోర్సింగ్​కు అప్పజెప్పింది. కొత్త పాసులు ఇవ్వాలన్నా, రెన్యూవల్​ చేయాలన్నా ఔట్​సోర్సింగ్​ సిబ్బందే చూసుకుంటారు.

ఎక్కడికని పోవాలె?

ఫ్రీ బస్​పాసుల రెన్యూవల్​ అంశంపై ఆర్టీసీ అధికారులను అడిగితే.. హైదరాబాద్​లోని కొన్నిచోట్ల చేస్తున్నామని, అక్కడికి వెళ్లి చేసుకోవాలని చెప్తున్నరు. జిల్లాల్లో మాత్రం పూర్తిగా బంద్​ అయినట్టు పేర్కొంటున్నారు. దీనిపై దివ్యాంగులు, ఫ్రీడం ఫైటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడ రెన్యూవల్ చేస్తున్నారో తమకెట్లా తెలుస్తుందని, తామెలా వెళ్లగలమని వాపోతున్నారు. వెంటనే బస్​పాస్​లను రెన్యూవల్​ చేయాలని
కోరుతున్నారు.