జాతీయ స్థాయిలో ప్రముఖ విద్యాసంస్థల ద్వారా ఉచితంగా ఆన్ లైన్ కోర్సులు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్లాట్ ఫాం ‘స్వయం’లోకి మొదటిసారి మన ఉస్మానియా యూనివర్శిటీ అడుగుపెట్టింది. తెలంగాణ చరిత్ర సంస్కృతి సాహిత్యంపై తెలుగులో 15 వారాల ప్రత్యేక కోర్సును రూపొందించింది. ఈ విధానంలో తెలుగులో రూపొందించిన మొదటి కోర్సు కూడా ఇదే. జనవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఈ కోర్సును ఇప్పటికే చేరికలు మొదలయ్యాయి. కోర్సు ప్రారంభించిన తర్వాత ఫిబ్రవరి 28 వరకు కూడా ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరయినా చేరడానికి వీలుంది. ఈ కోర్సుకు ఉస్మానియా యూనివర్శిటీ సీనియర్ ప్రొఫెసర్, యూనివర్శిటీ కాలేజీ ప్రిన్సిపాల్ చింతకింది కాశీం కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి సర్టిఫికెట్ కోర్సుకు 5 క్రెడిట్ పాయింట్లు కూడా ఇస్తారు. ఈ కోర్సులో చేరడానికి స్వయం ఆన్ లైన్ ప్లాట్ ఫాంలో లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. మొబైల్లో ఫాలో కావడానికి స్వయం యాప్ కూడా అందుబాటులో ఉంది.కోర్సులో భాగంగా తెలంగాణ మూలాలు, చరిత్ర నుంచి ఇప్పటి ఉద్యమ సాహిత్యం వరకు అన్ని అంశాలను అందిస్తున్నారు. పండుగలు, జానపదాల నుంచి రాష్ట్ర సాధన వరకు సమగ్రంగా పాఠాల్లో చెబుతారు. ప్రాచీన సాహిత్యంతో పాటు సుద్దాల, దాశరథి, కాళోజీ నుంచి గద్దర్, గూడ అంజన్న, గోరెటి వెంకన్న వరకు నాటి, నేటి తరం గొప్ప కవుల రచనలను పరిచయం చేస్తారు.
15 వారాల పాటు సాగే ఈ కోర్సులో వారానికి మూడునాలుగు చొప్పున 51 వీడియో పాఠాలను అందుబాటులో ఉంచుతారు. ప్రతి శుక్రవారం ఆ వారానికి సంబంధించిన పాఠాలపై ఆన్ లైన్ అసైన్ మెంట్లు ఉంటాయి. ఈ ఇంటర్నల్ అసైస్ మెంట్లకు 30 శాతం వెయిటేజీ మార్కులు ఉంటాయి. కనీసం సగం అసైన్ మెంట్లలో అత్యధికంగా మార్కులు వచ్చిన అసైన్ మెంట్ల యావరేజీ ఆధారంగా ఇంటర్నల్ స్కోరు నిర్ణయిస్తారు.
పూర్తి ఉచితంగా జరిగే ఈ కోర్సుకు క్రెడిట్ పాయింట్లు, సర్టిఫికెట్ కావాలనుకున్నవాళ్లు ప్రత్యేక కేంద్రాల్లో నిర్వహించే ఆన్ లైన్ పరీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనికి మాత్రమే ప్రత్యేకంగా ఫీజు చెల్లించాలి. ఈ పరీక్షలో వచ్చే మార్కులను 70 శాతం వెయిటేజీగా తీసుకొని, ఇంటర్నల్ మార్కులతో కలిపి ఫైనల్ స్కోరు నిర్ణయిస్తారు. ఇంటర్నల్స్, ఎగ్జామ్ రెండింట్లోనూ వేర్వేరుగా కనీసం 40 శాతం స్కోర్ వస్తేనే క్వాలిఫై అయినట్లు గుర్తిస్తారు. ఈ కోర్సు సర్టిఫికెట్ కూడా ఈ-సర్టిఫికెట్ రూపంలోనే ఉంటుంది.
