ఉచిత రేషన్​ 5 కిలోలే

ఉచిత రేషన్​ 5 కిలోలే

గత నెలలో ఇవ్వాల్సినవే నేటి నుంచి పంపిణీ
10 కిలోలు ఇవ్వాల్సి ఉండగా.. ఐదు కిలోలే 
ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
కేంద్రం ఇస్తున్న ఫ్రీ రేషన్​, రాష్ట్ర కోటాపై నో క్లారిటీ

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో 5 కిలోలే ఉచిత రేషన్ అందిస్తోంది. అది కూడా మే, జూన్‌లో పంపిణీ చేయాల్సిన కోటాలో ఆపిన బియ్యాన్నే ఇస్తోంది. జులైలో ఇవ్వాల్సిన రాష్ట్ర కోటాతోపాటు కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యం పంపిణీని నిలిపేసింది. పేదలను ఆదుకునేందుకు కేంద్రం అదనపు రేషన్‌  అందిస్తుంటే.. దానికి భిన్నంగా రాష్ట్ర సర్కారు రేషన్‌లో కోత పెడుతోంది. జులైలో కేవలం 5 కిలోల బియ్యమే పంపిణీ చేస్తామని సివిల్‌ సప్లయ్స్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ నెల లబ్ధిదారులకు ఉచితంగా అందాల్సిన 2.8 లక్షల టన్నుల బియ్యం పంపిణీ నిలిచిపోయినట్లయింది. 
కేంద్రం ప్రకటనపై నిర్ణయం తీసుకోలే
కరోనా నేపథ్యంలో నిరుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశాయి. గతేడాది ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఒక్కో లబ్ధిదారునికి 12 కిలోల చొప్పున అందజేశాయి. తర్వాత మరో ఆరు నెలలు 10 కిలోల చొప్పున పంపిణీ జరిగింది. ఈ ఏడాది కూడా వచ్చే నవంబర్ దాకా ఉచిత రేషన్ పంపిణీని కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీనిపై రాష్ట్రం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

అదికాక జులైలో 5 కిలోల ఉచిత రేషన్‌‌ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ నెల రేషన్ కోటా ఎత్తేయడంపై విమర్శలు వస్తున్నాయి. కేంద్రం రేషన్ ఉచితంగా ఇస్తోందనే విషయం ప్రజలకు తెలియకుండా ఉండేందుకు రాష్ట్ర సర్కారు ఇలా జాప్యం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఉచిత రేషన్ అందాల్సింది ఇలా..
రాష్ట్రంలోని 2.80 కోట్ల మంది రేషన్ లబ్ధిదారుల్లో 1.92 కోట్ల మందికి కేంద్రం కిలో రూ.3 చొప్పున బియ్యం అందిస్తుంది. రాష్ట్రం మరో రూ.2 సబ్సిడీ భరించి రూ.1కిలో చొప్పున ఇస్తుంది. రాష్ట్రం మరో 88.61 లక్షల మంది లబ్ధిదారులకు మొత్తం సబ్సిడీ భరించి రేషన్‌‌ ఇస్తుంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం గరీబ్‌‌ కల్యాణ్‌‌ యోజన కింద అదనంగా మరో 5 కిలోలు ఉచితంగా రేషన్‌‌ పంపిణీ చేస్తోంది. రాష్ట్రం ప్రతి లబ్ధిదారునికి కేంద్రం ఇచ్చే రేషన్‌‌కు కిలో పెంచి 6 కిలోలు ఇస్తోంది. కేంద్ర నిర్ణయం మేరకు రాష్ట్రంలో మే నుంచి నవంబరు వరకు ప్రతి నెల ఇచ్చే 6 కిలోలతో పాటు మరో 5 కిలోలు ఉచితంగా అందాల్సి ఉంది. అంటే మొత్తంగా ప్రతి నెల ప్రతి లబ్ధిదారుడికి 11 కిలోల బియ్యం అందాల్సి ఉంది. కానీ రూపాయికి కిలో చొప్పున 6 కిలోలు ఇచ్చే కోటాను.. ఉచిత రేషన్ పేరుతో 5 కిలోలకు రాష్ట్రం తగ్గించింది. అలా చూసుకున్నా 10 కిలోలు ఇవ్వాల్సి ఉండగా.. 5 కిలోలే ఇస్తోంది.