- ఆర్థిక ఎమర్జెన్సీ తప్పదు.. ఫ్రీ స్కీమ్స్‌పై హైకోర్టు వ్యాఖ్యలు
- కోటీశ్వరులకూ రైతుభరోసా.. రేషన్ బియ్యానికి బైక్‌పై వస్తున్నారు
- చదువుకోని విద్యార్థులకూ ఫీజులు చెల్లిస్తున్నారని కామెంట్
- కంటోన్మెంట్ బోర్డు నిధుల అంశంలో ఫిర్యాదుపై విచారణ
- వారెంట్ జారీతో కోర్టుకు హాజరైన ఆర్థికశాఖ
- ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా
- ధిక్కరణ కేసుల్లో శిక్షవేస్తే జీవితకాలం
- జైల్లోనే ఉండాల్సి వస్తుందన్న కోర్టు
హైదరాబాద్, వెలుగు: ఎలా పడితే అలా ఉచిత పథకాలు ఇస్తూ పోతే కుబేరుడు కూడా కూలీకి వెళ్లే పరిస్థితి తప్పదని హైకోర్టు హెచ్చరించింది. గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్‌లు ఇలాగే కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ తప్పదని వ్యాఖ్యానించింది. ఉచితాలివ్వాల్సిందేనని, అయితే అర్హులకు ఇవ్వాలని, కోటీశ్వరులకూ రైతు బంధు ఇస్తున్నారని, చదువుకోని విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నారని పేర్కొన్నది.
కంటోన్మెంట్ బోర్డుకు రూ.33.42 కోట్ల నిధులు విడుదల చేయాలని 2024లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలంటూ ఇచ్చిన వినతి పత్రాలపై చర్యలు తీసుకోకపోవడంతో కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు జె.రామకృష్ణ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం విచారణ చేపట్టారు. హైకోర్టు జారీ చేసిన బెయిలబుల్ వారెంట్‌ల నేపథ్యంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా కోర్టు ముందు హాజరయ్యారు. రూ.25.70 కోట్లు గత మేలో చెల్లించామని, మిగిలినవి వాయిదాల పద్ధతిలో ఆరు నెలల్లో చెల్లిస్తామని చెప్పారు.
ఈ దశలో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చి రెండేండ్లయినా అమలు కాలేదని తెలిపారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ ఇందులో మనకు ఎంత బాధ్యత ఉందని ప్రశ్నించారు. సమాజంలో పౌరులకు బాధ్యత లేనప్పుడు అధికారులు ఏం చేస్తారన్నారు. రాష్ట్రానికి రూ.3.24 లక్షల కోట్లు వస్తుంటే అప్పులు, వేతనాలు ఇలా అన్నీ పోను రూ.90 కోట్లు మిగులుతోందని, అందులో రూ.89 కోట్లు సంక్షేమ పథకాలకు వెళ్తుంటే భవిష్యత్తులో పిల్లలకు ఏమివ్వాలని అడిగారు.
పల్సర్‌బైక్, ఐఫోన్‌తో ఉచిత బియ్యం కోసం వెళ్తున్నారన్నారు. ఇన్ని అనవసరమైన ఉచిత పథకాలా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉచితం ఇవ్వాల్సిందే అయితే అనవసరమైనవి ఇవ్వొద్దని సూచించారు. ‘‘కోటీశ్వరులకూ రైతు బంధు ఇస్తున్నారు. ప్రభుత్వంపై ఎంత భారం పడుతున్నది. భవిష్యత్తులో పిల్లలకు ఏం మిగులుతుంది” అని ప్రశ్నించారు. గతంలో ఈ దేశానికి మనం ఏం ఇచ్చామనేవారని, గాంధీ, నెహ్రూలు దేశానికి ఏం ఇద్దామనుకునేవారని, ప్రస్తుతం మన గ్రామానికి, మన వీధికి ఏం వస్తుందని, చివరికి నాకేమి ఇచ్చారు అనే స్థితికి చేరుకున్నారన్నారు.
ఒక్క తెల్లకార్డును కూడా తొలగించలేరు!
అనర్హులకు చెందిన ఒక తెల్లకార్డును అయినా తొలగించగలరా? అని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అలా తొలగిస్తే అదో రాజకీయమవుతుందని పేర్కొన్నది. అధికారులు మాత్రం ఏం చేస్తారని, ఒక్క అధికారిపై 3 నుంచి 4 వేల కేసులున్నాయని, ఇలాగైతే ఆయన జీవితం కాలం జైలులోనే ఉంచాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. ప్రస్తుత అధికారిపై 100కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఏ అధికారి అయినా ఏం చేయలేరని, రేపు మీరే ముఖ్యమంత్రి అయినా ఏం చేయలేని పరిస్థితి అని జడ్జి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది రాజకీయ ఉపన్యాసం కాదని.. సగటు మనిషిగా ఆవేదనతో చెబుతున్నానన్నారు. ‘‘నేనూ రైతునే..గ్రామాల్లోకి వెళ్తే రైతులు కూలీలు దొరక్క ఏడుస్తున్నారు. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, బిహార్ నుంచి కూలీలు వస్తుండగా ఇక్కడ మనవాళ్లు పనులకు వెళ్లడంలేదు. ఇలాగైతే భవిష్యత్తులో మనుషులు పనిచేసేవారంట అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎదురుకావొచ్చు. కనీసం గొయ్యి తీసి, పూడ్చడంలాంటి పని చేసినా డబ్బులు ఇవ్వాలి.
పథకాల కింద వచ్చే సొమ్ముతో కాలుమీద కాలు వేసుకుని బతుకుతుంటే ఉద్యోగులు కూడా ఉద్యోగాలు మానేసి కూర్చుంటారు. అప్పులు తీర్చడానికి భూములను విక్రయిస్తున్నారు. భవిష్యత్ అవసరాల గురించి ఆలోచించడం లేదు. అప్పు చేసి ఎవరైనా బెంజ్ కారు కొంటారా? ఎర్రబస్సులో వెళ్లే వాళ్లం ఎయిర్‌బస్‌లో వెళ్తామంటే ఆ కుటుంబం ఎంత కాలం నిలబడుతుంది.
మూడు లక్షల వేతనం వస్తుంటే దానికి తగ్గట్టుగానే కుటుంబాన్ని నడపాలిగానీ దానికి మించి వెళ్లొద్దు. ఇంజినీరింగ్ కాలేజీ పిల్లలు కూడా కాలేజీలకు వెళ్లకుండా నిర్వాహకులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అటెండెన్స్ కోసం కాలేజీ యాజమాన్యాలు పిల్లలను బతిమాలాడుకోవాల్సి వస్తోంది.
మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి బైక్ పాడయితే రిపేరు చేసుకోలేక మెకానిక్‌ను పిలిపించేలా చదువులున్నాయి. కష్టపడి. చదువుకునేవారికి ఫీజులు ఇవ్వాలి. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలుంటే 1.03 కోట్ల కుటుంబాలకు ఉచిత పథకాలు అందిస్తుంటే ఈ దేశాన్ని ఎవరు నడుపుతారు. ఇలా పథకాల కొనసాగింపు దీర్ఘకాలం సాధ్యం కాదు.
సమాజం ప్రమాదంలో పడబోతున్నది. ఇది ఎంత వరకు సబబో ప్రభుత్వమే తేల్చుకోవాలి” అని వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్ చెల్లింపులకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని సందీప్‌కుమార్ సుల్తానియాను ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.
