- మొన్నటి వరకు ముఖం చాటేసిన వర్షాలు
- పంటలు ఎండిపోతాయనే భయంలో రైతాంగం
హైదరాబాద్, వెలుగు: తాజాగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో గత కొన్ని రోజులుగా వానలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోశాయి. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది వంటి ప్రధాన పంటలకు ఈ వర్షాలు ఎంతో మేలు చేశాయి. గత జూన్, ఆగస్టు నెలల్లో వర్షాల లోటుతో అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబర్‌లోనైనా వర్షాలు కురవకపోతే దిగుబడులపై ప్రభావం తప్పదన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే, తాజా వర్షాలతో పరిస్థితి చాలా వరకు మెరుగుపడిందని రైతులు అంటున్నారు. సెప్టెంబర్ మొదటి వారం వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం లోటు నమోదైంది.
376 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు అప్పట్లో నివేదికలు వెల్లడించాయి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలపైనే రైతుల ఆశలు పెట్టుకున్నారు. వరి పంట పొలాలకు కంకి దశ, గింజ నింపే దశల్లో తగినంత తేమ అవసరం. పత్తిలో కాయల అభివృద్ధి, సోయాబీన్, కంది వంటి పంటల్లో పూత, కాయ దశలకు నీటి అవసరాలు చాలా కీలకం. ఈ దశలో వర్షాలు అందితే దిగుబడులు కొంతవరకు నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. తాజా వానలు కొంత ఊరట కలిగిస్తున్నాయి. పంట చేతికి వచ్చే వరకు వాతావరణం అనుకూలంగా ఉంటే.. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అగ్రికల్చర్ నిపుణులు అంటున్నారు.
కోటి 23 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు..
తాజా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 9 నాటికి రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు విస్తీర్ణం కోటి 23 లక్షల ఎకరాలకు చేరింది. గతేడాది ఇదే సమయానికి కోటి 30 లక్షల ఎకరాల్లో సాగు జరగగా.. ఈసారి ఎల్‌నినోతో 7.50 లక్షల ఎకరాలు తగ్గాయి. అయినా కూడా గతేడాదితో పోలిస్తే పత్తి సాగు పెరిగింది. ఈసారి 48.24 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. 54.26 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. పత్తి సాగు సాధారణ విస్తీర్ణాన్ని దాటడం గమనార్హం. మరోవైపు, ఎల్‌నినోతో వర్షాలు తగ్గుతాయన్న అంచనాలు ఉన్నప్పటికీ రైతులు వరి సాగుకే మొగ్గు చూపారు. రాష్ట్రవ్యాప్తంగా వరినాట్లు 54 లక్షల ఎకరాలకు పైగా పడ్డాయి. ఈ సీజన్ ముగిసే నాటి వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం వరి సాగు 57.7 లక్షల ఎకరాలకు చేరే అవకాశం ఉందని, 119.57 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.
సాధారణ సాగును మించి పత్తి..
ఎల్‌నినో నేపథ్యంలో వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందనే అంచనాలతో రైతులు వరి తర్వాత పత్తి సాగుకే ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించి నమోదైంది. ఈసారి 48.24 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. వర్షాలు ఆలస్యమైన ప్రాంతాల్లో పత్తి మొక్కలు ఎదుగుదలలో కొంత వెనుకబడినా.. తాజాగా కురుస్తున్న వర్షాలు నేలలో తేమను పెంచడంతో పంటలకు మేలు జరుగుతోందని రైతులు భావిస్తున్నారు. అలాగే, ఈ సీజన్‌లో వరి, పత్తితో పాటు మక్క, కంది, సోయా పంటల సాగు కూడా గణనీయంగానే ఉంది. మొక్కజొన్న 5.94 లక్షల ఎకరాల్లో నమోదు కాగా, కంది 5.57 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత సోయాబీన్ 3.72 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. పెసలు, మినుములు తదితర పప్పుధాన్యాలు 7.91 లక్షల ఎకరాల్లో సాగైంది. పప్పుధాన్యాల సాగు గతేడాదితో పోలిస్తే పెరిగింది. కంది, పెసర, మినుము సాగులో రైతులు ఆసక్తి చూపారు.
పొడిబారిన పంటలకు ప్రాణం..
వర్షాలు లేకపోవడంతో కొన్ని జిల్లాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు చాలా ప్రాంతాల్లో ఎండిపోయే పరిస్థితి నెలకొంది. తాజాగా కురిసిన వర్షాలు ఆయా పంటలకు ఉపశమనం కలిగించాయి. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం కురిసిన వర్షాలతో రైతుల్లో హర్షం వ్యక్తమైంది. మంచిర్యాల జిల్లాలో ఒక్కరోజే సగటున 26 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్‌లో 25.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పంటలు వాడిపోయే దశకు చేరుకున్న సమయంలో ఈ వర్షాలు జీవం పోశాయని రైతులు పేర్కొంటున్నారు.
