తెలంగాణ బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ గా రామ్‌‌‌‌రెడ్డి

తెలంగాణ బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ గా రామ్‌‌‌‌రెడ్డి
  • వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా వెంకట్‌‌‌‌ యాదవ్‌‌‌‌
  • బీసీఐ సభ్యుడిగా కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తెలంగాణ బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా రామ్‌‌‌‌రెడ్డి సాముల ఎన్నికయ్యారు. చైర్మన్‌‌‌‌ పదవికి ముగ్గురు పోటీ చేయగా రామ్‌‌‌‌రెడ్డికి 12 ఓట్లు లభించాయి. పొన్నం అశోక్‌‌‌‌గౌడ్‌‌‌‌కు 11, హన్మంత్‌‌‌‌రెడ్డికి 3 ఓట్లు వచ్చాయి. దీంతో సమీప ప్రత్యర్థి అశోక్‌‌‌‌గౌడ్‌‌‌‌పై రామ్‌‌‌‌రెడ్డి సాముల ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించారు. అశోక్‌‌‌‌గౌడ్‌‌‌‌ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌కు సోదరుడు కాగా, కాంగ్రెస్‌‌‌‌ లీగల్‌‌‌‌ సెల్‌‌‌‌లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా వెంకట్‌‌‌‌ యాదవ్‌‌‌‌ చలకాని ఎన్నికయ్యారు.

ఈ పదవికి ముగ్గురు పోటీ చేయగా వెంకట్‌‌‌‌ యాదవ్‌‌‌‌కు 13 ఓట్లు, జకీర్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ జావెద్‌‌‌‌కు 10, రామారావు గోకుల్‌‌‌‌కు 3 ఓట్లు లభించాయి. దీంతో వెంకట్‌‌‌‌ యాదవ్‌‌‌‌ తన సమీప ప్రత్యర్థిపై మూడు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వెంకట్‌‌‌‌ యాదవ్‌‌‌‌ గతంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా సభ్యుడిగా కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌ గన్నమనేని ఎన్నికయ్యారు. ఈ పదవికి ఐదుగురు పోటీ చేయగా కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌ కు 10 ఓట్లు, డి.జగదీశ్వర్‌‌‌‌రావుకు 7, పాశం సుజాతకు 4, ఆకుల అనంతసేన్‌‌‌‌రెడ్డికి 3, అనిల్‌‌‌‌ కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌కు 2 ఓట్లు వచ్చాయి. దీంతో జగదీశ్వర్‌‌‌‌రావుపై మూడు ఓట్ల ఆధిక్యంతో కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌ గెలుపొందారు. ఆయన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీగల్‌‌‌‌ సెల్‌‌‌‌లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. 

ఎన్నికల నేపథ్యం

తెలంగాణ బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌కు 2018లో ఎన్నికలు జరగగా, అనంతరం కొత్త కౌన్సిల్‌‌‌‌ ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2026 జనవరి 30న రాష్ట్రవ్యాప్తంగా బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ సభ్యుల ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 203 మంది న్యాయవాదులు పోటీ చేసిన ఈ ఎన్నికల్లో 23 మంది సభ్యులు ఎన్నికయ్యారు. మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఐదుగురు మహిళలు ఎన్నిక కాగా, మరో ఇద్దరు మహిళా సభ్యులను నామినేట్‌‌‌‌ చేశారు.

ప్రాధాన్యతా ఓటింగ్‌‌‌‌ విధానంలో జరిగిన ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 10న ప్రారంభమై మార్చి 24న పూర్తయింది. అనంతరం కొత్తగా ఏర్పడిన కౌన్సిల్‌‌‌‌ నుంచి చైర్మన్‌‌‌‌, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌, బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా సభ్యుడి ఎన్నిక నిర్వహించారు. తాజా ఎన్నికల ఫలితాలను తెలంగాణ బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ అధికారిక ప్రకటన 
ద్వారా వెల్లడించింది.