రాళ్లు ఎగిసిపడుతున్నయ్.. ఇండ్లు బీటలు వారుతున్నయ్: మల్లన్నసాగర్ బ్లాస్టింగ్స్ తో జనం బేంబేలు

రాళ్లు ఎగిసిపడుతున్నయ్.. ఇండ్లు బీటలు వారుతున్నయ్: మల్లన్నసాగర్ బ్లాస్టింగ్స్ తో జనం బేంబేలు

మల్లన్నసాగర్ ​పనులపై గ్రామస్థుల ఆందోళన

ఎగిసిపడుతున్న రాళ్లు.. బీటలువారుతున్న ఇండ్లు

సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం ​మూడో టీఎంసీ పనులకు ఇంకా పర్యావరణ అనుమతులు రాలేదు. భూసేకరణ చేయలేదు. పనులు చేపట్టవద్దని గ్రీన్​ట్రిబ్యూనల్​ఆదేశాలు సైతం ఉన్నాయి. ఇన్ని అడ్డంకులున్నా కాంట్రాక్టర్లు ఆగడం లేదు. ఊరిని ఖాళీ చేయించకుండానే ఆ పక్కనే గతంలో మల్లన్నసాగర్​కోసం సేకరించిన భూముల్లో పనులు సాగిస్తున్నారు. నిత్యం పేలుళ్లతో గ్రామస్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్​గ్రామానికి వంద మీటర్ల దూరంలోనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్ట నిర్మాణం సాగుతోంది. తుక్కాపూర్​గ్రామ పంచాయతీ పరిధిలోని 1,600 ఎకరాల్లో దాదాపు 1,300 ఎకరాలను ప్రభుత్వం మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించింది. సేకరించిన భూమిలో ఇప్పటికే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మిడ్​మానేరు నుంచి మల్లన్న సాగర్​కు అదనంగా మరో టీఎంసీ నీటిని తేవడం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా చేస్తున్న పనులతో ప్రస్తుతం తుక్కాపూర్​వాసులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. కట్ట సమీపంలో భూమిలో పెద్ద బండరాయి రావడంతో వాటిని పగలగొట్టడానికి ఇష్టారీతిగా బ్లాస్టింగ్​చేస్తుండడంతో గ్రామస్థులు భయం భయంగా బతుకుతున్నారు. గ్రామానికి కేవలం వంద మీటర్ల దూరంలోనే నాలుగైదు రోజులుగా బ్లాస్టింగ్స్​నిర్వహిస్తుండటంతో ఇండ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. బ్లాస్టింగ్​వల్ల ఎగిసిపడుతున్న రాళ్లతో పలువురికి గాయాలవుతున్నాయి. వేళాపాళా లేకుండా సాగుతున్న పేలుళ్లతో గ్రామంలో నివసించే పరిస్థితి లేకుండా పోయిందని, దీనికి తోడు దుమ్ము ధూళితో ఆరోగ్యాలు చెడిపోతున్నాయని వాపోతున్నారు. బ్లాస్టింగ్​కు సంబంధించి కనీస సమాచారం సైతం ఇవ్వకుండానే కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారని, దీంతో బయటికి రావాలంటేనే  భయపడాల్సి వస్తోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రీన్​ ట్రిబ్యూనల్​ ఆదేశించినా..

మల్లన్న సాగర్ అదనపు టీఎంసీ పనుల నిర్వహణపై అధికారులు వ్యూహాత్మకంగా రూటు మార్చారు. ఇటీవలే అదనపు టీఎంసీ పనుల కోసం భూమి పూజ నిర్వహించడంతో భూసేకరణ జరపకుండానే పనులు ఎలా సాగిస్తారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో కొందరు కోర్టును ఆశ్రయించగా పర్యావరణ అనుమతులు లేకుండా అదనపు టీఎంసీ పనులను ప్రారంభించవద్దని  గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది. కోర్టు ఆటంకాలు, పై అధికారుల ఒత్తిడి నేపథ్యంలో అధికారులు రూటు మార్చారు. అదనపు టీఎంసీ నీటి తరలింపు పైప్ లైన్స్ కోసం భూ సేకరణ పూర్తి కాకపోవడంతో గతంలో మల్లన్న సాగర్​కోసం సేకరించిన భూముల్లో ప్రస్తుతం పనులు ప్రారంభించారు. ఈ పనులు సైతం నిర్దేశిత పైప్ లైన్​కు సమీపంలోనే ఉండటం గమనార్హం. అదనపు టీఎంసీ నీటి తరలింపు పైప్ లైన్​కు సమీపంలో భూమిలో భారీ బండ బయటపడటంతో దాన్ని తొలగించడానికి కాంట్రాక్టర్లు నిత్యం బ్లాస్టింగ్స్​చేస్తున్నారు. ఒక్కోసారి రాత్రిళ్లు సైతం పేలుళ్లు నిర్వహిస్తున్నారు. అదనపు టీఎంసీ పైప్ లైన్ పనులకు భూములు ఇవ్వడానికి ఇష్టపడకపోవడంతో పొమ్మనలేక పొగ పెట్టినట్టుగా ఇలా చేస్తున్నారని గ్రామస్థులు అంటున్నారు. భూములు కోల్పోయిన వారికి న్యాయంగా పరిహారంతోపాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తే తామే గ్రామాన్ని విడిచిపోతామని చెప్పినా బలవంతంగా వెళ్లగొట్టేందుకే అధికారులు, కాంట్రాక్టర్లు కలసి కుట్ర పన్నుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ముందస్తు సమాచారం ఇస్తలేరు

గ్రామస్థులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బ్లాస్టింగ్స్​నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుస పేలుళ్లతో గ్రామంలోని ఇండ్లు బీటలు వారుతుండగా, పాత ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి గ్రామస్థుల సమస్య పరిష్కరించాలి. – చిక్కుడు చంద్రం, సర్పంచ్, తుక్కాపూర్

ముందు పరిహారం ఇవ్వాలె

ప్రతి రోజు రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడు పడితే  అప్పుడు పేలుళ్లు నిర్వహిస్తున్నారు. పేలుళ్లతో రాళ్లు ఎగిసిపడి పలువురు గాయపడ్డారు. గ్రామస్థులకు సరైన పరిహారం అందించి ఊరు ఖాళీ చేసిన తర్వాతే పనులు నిర్వహించాలి. – సి.హెచ్.రాజు, తుక్కాపూర్